ఖర్గే 'కాషాయ' వ్యాఖ్యలపై దుమారం ... బిజెపి నేతలే కాదు సాధువులూ సీరియస్

By Arun Kumar P  |  First Published Nov 11, 2024, 6:52 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు మతపరంగాను దుమారం రేగింది. బీజేపీ, సాధు సమాజం ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.


లక్నో : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు మతపరంగా దుమారం రేపాయి. యోగి ఆదిత్యనాథ్ కాషాయ వస్త్రధారణపై ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, అనుబంధ పార్టీలు, సాధు సమాజం తీవ్రంగా స్పందిస్తున్నాయి.

జార్ఖండ్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సాధువుల గురించి ఖర్గే మాట్లాడుతూ... చాలా మంది సాధువులు ఇప్పుడు రాజకీయ నాయకులయ్యారని, కాషాయ వస్త్రాలు ధరించి సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ప్రజలను విడదీయడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ, సాధు సమాజం నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఖర్గేపై వస్తున్నాయి.

బీజేపీ, అనుబంధ పార్టీల ఘాటు విమర్శలు

Latest Videos

undefined

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ, అనుబంధ పార్టీలు విరుచుకుపడ్డాయి. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఇది కాంగ్రెస్ పాత మనస్తత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం, సమాజంలో చిచ్చు పెట్టడమేనని విమర్శించారు. హిందూ ధర్మం, సనాతన సంస్కృతిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మొఘల్ దండయాత్రలతో పోలుస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని బ్రజేష్ పాఠక్ డిమాండ్ చేశారు.

మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. విడగొట్టి పాలించడమే కాంగ్రెస్ చరిత్ర అని, బీసీ, ఎస్సీ, ముస్లింలను కాంగ్రెస్ మోసం చేసిందన్నాారు. అధికారంలో ఉన్నప్పుడు విద్య, వైద్యం, పారిశుధ్యం, రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పుడు కూడా అభివృద్ది, సంక్షేమం గురించి కాకుండా,వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చల్లో ఉండాలని చూస్తున్నారని ఆరోపించారు.

సాధు సమాజం నుంచి తీవ్ర స్పందన

ఖర్గే వ్యాఖ్యలపై సాధు సమాజం నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. అఖిల భారత సాధు సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి ఖర్గే వ్యాఖ్యలు హేయమైనవని, ఖండించదగినవని అన్నారు. హిందూ ధర్మం, సనాతన సంస్కృతిపై దాడులు ఆపకపోతే సాధు సమాజం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని కాంగ్రెస్‌ను హెచ్చరించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీని ఆల్ ఇండియా చర్చి కమిటీ అన్నారు. ఇకనైనా హిందూ, సనాతన ధర్మాలపై దాడి ఆపాలని, లేదంటే సాధు సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

అయోధ్యకు చెందిన స్వామి కర్పత్రి మహరాజ్ కూడా ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. మల్లికార్జున ఖర్గే పేరులో 'ఖడ్గం' ఉంది, దాని పని విభజించడం, నరకడం అన్నారు. యోగి ఆదిత్యనాథ్ పేరు 'యోగ'తో ముడిపడి ఉంది, దాని అర్థం కలపడం అని అన్నారు. హిందూ ధర్మంపై దాడి చేసేవారికి కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు ఇచ్చిందని కర్పత్రి మహరాజ్ అన్నారు.

click me!