మహిళలకు యోగి సర్కార్ గుడ్ న్యూస్ : హాస్పిటల్ వెళ్లకుండానే ఆరోగ్య సమస్యలు పరిష్కారం

By Arun Kumar PFirst Published Oct 3, 2024, 10:19 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రత, గౌరవం కోసం యోగి ప్రభుత్వం 'మిషన్ శక్తి' ఐదో దశను ప్రారంభించనుంది. ఈ దశలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు, పథకాల గురించి తెలుసుకోండి.

లక్నో : రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం, స్వావలంబనను పటిష్టం చేసేందుకు యోగి ప్రభుత్వం 'మిషన్ శక్తి' ఐదో దశను ప్రారంభించనుంది. నవరాత్రి సందర్భంగా సీఎం యోగి ఈ కార్యక్రమానికి స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, గౌరవం, స్వావలంబన కోసం పలు కొత్త పథకాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు హోం శాఖతో పాటు 12 శాఖలకు బాధ్యతలు అప్పగించారు.

ఉత్తర ప్రదేశ్ లో మహిళా  అభ్యున్నతి కోసం 2020 అక్టోబర్ 17న యోగి ప్రభుత్వం మిషన్ శక్తిని ప్రారంభించింది. 2021 ఫిబ్రవరి 26న రెండో దశ, 2021 ఆగస్టు 21న మూడో దశ, 2022 అక్టోబర్ 14న నాలుగో దశను ప్రారంభించారు.

Latest Videos

 లక్నోలో సీఎం యోగి మిషన్ శక్తి ఐదో దశను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల్లో మిషన్ శక్తి నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొంటారు. లక్నోతో పాటు రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో మహిళా సాధికారత ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీఎం యోగి మహిళా భద్రత, సాధికారత కోసం పలు పథకాలను ప్రారంభిస్తారు.

ఉమెన్స్ ఫెస్ట్‌తో పాటు హెల్త్ హెల్ప్‌లైన్ ప్రారంభం:

లక్నోలోని 1090 చౌరాహాలో ఉమెన్స్ ఫెస్ట్ నిర్వహిస్తారు. మహిళా స్వయం సహాయక బృందాలు (SHG) తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, వ్యవస్థాపకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా 'మహిళా ఆరోగ్య లైన్' అనే హెల్త్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నారు.

ఉమెన్ పవర్ లైన్ 1090 తరహాలోనే ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. సామాజిక అడ్డంకుల కారణంగా ఆరోగ్య సమస్యలను బహిర్గతం చేయలేని మహిళలకు ఈ హెల్ప్‌లైన్ ఉపశమనం కలిగిస్తుంది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా మహిళలకు స్త్రీరోగ నిపుణులతో టెలీ-కన్సల్టేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనివల్ల మహిళలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులు, క్లినిక్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.

click me!