భారత్ ఆదేశాలు బేఖాతరు, ఆ ట్వీట్లు కొనసాగుతాయి: ట్విట్టర్ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Feb 9, 2021, 6:03 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం జరుగుతోందంటూ నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం జరుగుతోందంటూ నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రైతులకు మద్ధతుగా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్ చేయడం .. దీనికి కౌంటర్‌గా భారతదేశానికి చెందిన సచిన్, కంగనా, అక్షయ్ కుమార్‌ సహా తదితరులు కౌంటరిచ్చారు.

దీంతో ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఖలిస్థాన్‌, పాకిస్థాన్‌ సానుభూతిపరులు ఇలాంటి అసత్య వార్తల ప్రచారాన్ని చేస్తున్నట్లు తేలడంతో 257 ఖాతాలను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌ను ఆదేశించింది.

అయితే, ప్రభుత్వ సూచనల మేరకు తొలుత వాటిని తొలగించిన ట్విటర్‌, కొన్ని గంటల్లోనే మళ్లీ ఆ ఖాతాలను పునురుద్ధరించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా రైతుల ఉద్యమంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న మరో 1178 ఖాతాలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు పరచకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఈ నేపథ్యంలో ట్విట్టర్ స్పందించింది. ఉద్యోగుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని... ఖాతాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై చర్చించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖను సంప్రదించినట్లు పేర్కొంది.

కొన్ని ట్విటర్‌ ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందిన విషయాన్ని ఈ సందర్భంగా ట్విటర్ ధ్రువీకరించింది. అయినప్పటికీ వాటిపై ట్విటర్ ఇంకా‌ చర్యలు తీసుకోలేదు. స్వేచ్ఛగా సమాచార మార్పిడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం వుంటుందని ట్విట్టర్ అభిప్రాయపడింది. 

అయితే, వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు చేసిన ట్వీట్‌‌ల‌కు ఆ సంస్థ‌ సీఈఓ లైక్‌ కొట్టడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ మహిమా కౌల్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. రాజీనామాకు  వ్యక్తిగత కారణాలను చూపించినప్పటికీ విషయం వేరే వుందని కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

click me!