తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:32 PM (IST) Jul 13
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన టీ 20, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. టీ 20 బ్యాట్స్‌మెన్ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ 5లో నిలిచారు. అలాగే వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక... టెస్టుల్లో భారత జట్టు (128 పాయింట్లు) రెండో స్థానంలో నిలవగా.. వన్డేల్లో (108 పాయింట్లు) మూడో స్థానంలో, టీ 20ల్లో (270 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది.
08:47 PM (IST) Jul 13
హెటిరోకు జాతీయ హరిత ట్రిబ్యూనల్ షాకిచ్చింది. విశాఖలోని సెజ్‌లో పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ రూ.6.95 కోట్ల జరిమానాను విధించింది ఎన్జీటీ. నిపుణుల కమిటీ సమర్పించిన 311 పేజీల నివేదిక ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది.
08:14 PM (IST) Jul 13
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపటి నుంచి జూలై 17 వరకు ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
07:41 PM (IST) Jul 13
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. తక్షణ రక్షణ చర్యలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
07:00 PM (IST) Jul 13
ఇసుక మాఫియాతో చేతులు కలిపిన తిరుపతికి చెందిన నలుగురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇసుక మాఫియా వద్ద వీరు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తేలడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుళ్లు వున్నారు.
05:33 PM (IST) Jul 13
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్ధవుతోంది. నగరంలోని నాళాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమంది. ముఖ్యంగా నగరంలోని పురాతన భవనాలపై దృష్టి సారించింది. దీంతో కూలేందుకు సిద్ధంగా వున్న భవంతులను అధికారులు కూల్చేస్తున్నారు.
04:52 PM (IST) Jul 13
తెలుగురాష్ట్రాల్లో మరో మూడురోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంద్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయిని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళనుండి బయటకు రావద్దని హెచ్చరించారు. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
04:13 PM (IST) Jul 13
భారత ప్రభుత్వం కరోనా నుండి దేశ ప్రజలను కాపాడేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన మోదీ సర్కార్ ఇలాగే బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో 18ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎల్లుండి (శుక్రవారం) ఉచితంగా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
03:28 PM (IST) Jul 13
కులమత సంకెళ్లలో చిక్కుకుంటే పురోగమించలేమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని.. కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకుపోతే అది దేశానికే నష్టమన్నారు మంత్రి. దేశంలో ప్రస్తుతం మతం మత్తు మందులా తయారైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం యావత్తు జాగరూకతతో వుండాలని.. మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకుని వస్తోందంటూ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
02:44 PM (IST) Jul 13
ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిట్టినగర్ సొరంగ మార్గం ఇరువైపుల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చిట్టినగర్ నుండి సితార సెంటర్ వరకు రాకపోకలను అధికారులు నిలిపివేసారు.
02:05 PM (IST) Jul 13
భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలకు మూడురోజుల (సోమ, మంగళ,బుధవారాలు) సెలవు ప్రకటించిన ప్రభుత్వం మరికొద్దిరోజులు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసేపట్లో రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
01:35 PM (IST) Jul 13
కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కింకించిన ఎఫ్3 మూవీ ఓటిటి లో రిలీజ్ కు సిద్దమయ్యింది. ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో జూలై 22 నుండి ప్రేక్షకులకు అందుబాటులో వుండనుంది. 'మీ నవ్వులను, వినోదాన్ని మూడింతలు చేసే F3 సినిమా నెట్ ప్లిక్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది'' అంటూ నెట్ ప్లిక్స్ ప్రకటిచింది.
12:41 PM (IST) Jul 13
తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్య కమీషనర్ నవీన్ మిట్టల్ ఈ ఫలితాలు విడుదల చేసారు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో జాయినింగ్ కోసం 1,04,432 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో 81.14 శాతం, అగ్రికల్చర్ లో 81.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల జూలై 18న కౌన్సిలింగ్, 20న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది.
12:06 PM (IST) Jul 13
శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకి ఆందోళనకు దారితీయడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు పరారీ, ప్రధాని రాజీనామా, ప్రభుత్వం చేతులెత్తేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేసారు. తాజాగా ప్రధాని ఇంట్లోకి ఆందోళనకారులు చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. దీంతో ప్రధాని నివాసాన్ని ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశించింది.
11:27 AM (IST) Jul 13
తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భారీగా వరదనీరు పోటెత్తడంత భ్రదాచలం వద్ద నదీప్రవాహ ఉదృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
10:25 AM (IST) Jul 13
ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరింది. అన్ని గేట్లెత్తి నీటిని దిగువకు వదలడానికి ప్రయత్నించగా 17గేట్లు తెరుచుకోగా 18వ గేట్ మాత్రం తెరుచుకోవడం లేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. అర్ధరాత్రి అత్యవసర సైరన్లతో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
దీంతో 25 గ్రామాల ప్రజలు అలర్డ్ అయ్యారు.
09:43 AM (IST) Jul 13
భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనులు వరదనీటితో నిండిపోవడంతో బొగ్గు తవ్వకాలను ఆటంకం ఏర్పడింది. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
09:21 AM (IST) Jul 13
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారక భవనాన్ని ప్రజలు ముట్టడించగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా మిటలరీ విమానంలో ఆయ దేశంవిడిచి మాల్లీవులకు పరారయ్యారు.