Published : Jul 27, 2022, 09:25 AM ISTUpdated : Jul 27, 2022, 10:05 PM IST

Telugu News Live : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

Telugu News Live :  నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

09:25 PM (IST) Jul 27

అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి బయటపెడ్డ నోట్ల కట్టలు

బెంగాల్‌లో టీచర్ల ఉద్యోగాలకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇప్పటికే రూ.21 కోట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కట్టల కొద్ది సొమ్ము వెలుగుచూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈడీ అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో ఈ విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. 

08:50 PM (IST) Jul 27

టీఆర్ఎస్ పార్టీని వీడిన కీలక నేత

టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు రాజీనామా చేశారు. వీరందరితో కలిసి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు మోహన్ రెడ్డి ప్రకటించారు. 

08:01 PM (IST) Jul 27

బెంగళూరులో ప్రియుడిని పెళ్లాడిన సాయిప్రియ

విశాఖ ఆర్కే బీచ్‌లో మిస్సయినట్లుగా డ్రామా ఆడిన వివాహిత సాయిప్రియ మరోసారి ఝలక్ ఇచ్చింది. బెంగళూరులో ప్రియుడు రవిని పెళ్లాడిన ఆమె.. తాళిబొట్టుతో వున్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సాప్‌లో పంపింది. తమ కోసం వెతికితే చనిపోతామని సాయిప్రియ హెచ్చరించింది. 
 

07:06 PM (IST) Jul 27

వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీ పునరుద్ధరణ

వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీ పునరుద్ధరించనుంది కేంద్రం. కొన్ని మార్పులు చేస్తూ రాయితీ అమలు చేయాలని నిర్ణయించింది. వృద్ధులకు రాయితీ వయసు 58 నుంచి 70 ఏళ్లకు పెంచింది. జనరల్, స్లీపర్ క్లాస్‌లోనే వృద్ధులకు టికెట్ రాయితీ వర్తించనుంది. 
 

06:31 PM (IST) Jul 27

ప్రియుడితో లేచిపోవడానికి పక్కా డ్రామా..వివాహిత సాయి ప్రియ స్కెచ్..?

విశాఖలో వివాహిత సాయిప్రియ మిస్సింగ్ వ్యవహారం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్ నుంచి వివాహిత అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్డులోనే ఆమె ప్రియుడు వున్నట్లు గుర్తించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడీ కొట్టించి లవర్‌తో కలిసి నెల్లూరు జిల్లాకు చెందిన పరారైంది సాయిప్రియ. నెల్లూరుకు రైళ్లో వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమె ఆఖరి ఫోన్ కాల్‌ను కావలిలో ట్రేస్ చేశారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 

05:46 PM (IST) Jul 27

బీఎస్ఎన్ఎల్‌కు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజ్

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అలాగే భారత్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

04:59 PM (IST) Jul 27

మనీ లాండరింగ్ కేసుల విచారణ... ఈడీ సమర్ధించిన సుప్రీం కోర్టు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసుల్లో జరుపుతున్న విచారణ, నిందితుల అరెస్ట్ తదితర అంశాల్లో వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈడీ అధికారాలను ప్రశ్నిస్తూ దాఖలయిన పిటిషన్లను తోసిపుచ్చిన న్యాయస్థానం మనీ లాండరింగ్ నిరోదక చట్టం ప్రకారమే కఠినంగా వ్యవహరిస్తోందని ఈడీని సమర్ధించింది. 
 

04:03 PM (IST) Jul 27

ఔరంగాబాద్ పేరు మార్పుపై హైకోర్టులో పిల్

మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగబాద్ పేరును శంబాజీ నగర్ గా మార్చడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ (పిల్) దాఖలయ్యింది. ఔరంగాబాద్ కు చెందిన మహ్మద్ ముస్తాక్ అహ్మద్, అన్నాసాహబ్ ఖండరే, రాజేష్ మోరే ఈ పిల్ దాఖలు చేసారు. 

03:56 PM (IST) Jul 27

అలాగయితే మీపై సస్పెన్షన్ ఎత్తివేస్తాం..: ప్రతిపక్ష ఎంపీలకు మరో అవకాశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సస్పెన్షన్ కు గురయిన ప్రతిపక్ష ఎంపీలకు బిజెపి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. లోక్ సభలో అయితే స్పీకర్ కు, రాజ్యసభలో అయితే ఛైర్మన్ ను క్షమాపణలు కోరి సభలో ప్లకార్డులు ప్రదర్శించమని ఒప్పుకుంటే ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 


 

02:15 PM (IST) Jul 27

కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ తీవ్ర అస్వస్థత

ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.  అయితే అతడు అస్వస్థతకు గురవడంతో జైలు సిబ్బంది ఆర్ఎంఎస్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. అయితే తనకు ట్రీట్ మెంట్ వద్దని మాలిక్ డాక్టర్లను కోరుతున్నట్లు సమచారం.  

02:15 PM (IST) Jul 27

కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ తీవ్ర అస్వస్థత

ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.  అయితే అతడు అస్వస్థతకు గురవడంతో జైలు సిబ్బంది ఆర్ఎంఎస్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. అయితే తనకు ట్రీట్ మెంట్ వద్దని మాలిక్ డాక్టర్లను కోరుతున్నట్లు సమచారం.  

01:12 PM (IST) Jul 27

పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

దేశంలో నిత్యావసర ధరల పెంపు, ఆహార పదార్థాలపై జీఎస్టి విధించడాన్ని వ్యతిరేకిస్తూ లోక్ సభలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నలుగురు సభ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇలా సస్పెండయిన ఎంపీలు మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమని, రమ్యా హరిదాస్ పార్లమెంట్ గేట్ 1 వద్ద నిరసన చేపట్టారు. 

వీడియో

12:03 PM (IST) Jul 27

ఎమర్జెన్సీ మూవీ టీం ఇంట్రెస్టింగ్ అప్ డేట్... మాజీ ప్రధాని వాజ్ పేయిగా శ్రేయాస్ తల్పడే

ప్రముఖ నటి కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో  పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న 'ఎమర్జెన్సీ' మూవీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిగా శ్రేయాస్ తల్పడే కనిపించనున్నాడు. ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇందిరాగాంధీ గా కంగనా రనౌత్, జెపి నారాయణ్ గా అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.  

10:50 AM (IST) Jul 27

బిజెపి యువమోర్చా నాయకుడి దారుణ హత్య... కర్ణాటకలో ఉద్రిక్తత

దక్షిణ కన్నడ జిల్లాలో మంగళవారం రాత్రి బిజెపి యువమోర్చా నాయకుడు ప్రవీణ్ దారుణ హత్య కర్ణాటకలో ఉద్రిక్తతకు దారితీసింది. కేరళ సరిహద్దు  సుళ్య తాలుకా బెళ్లారపేటలో పౌల్ట్రీ షాప్ నడుపుకునే బిజెపి నాయకున్ని గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. కేరళ నెంబర్ ప్లేట్ తో కూడిన బైక్ పై వచ్చిన ఇద్దరు దుండుగులు రోడ్డుపై వెంటపడి మరీ ప్రవీణ్ ను నరికి చంపారు. 

10:32 AM (IST) Jul 27

Corona Updates in India : గత 24గంటల్లో 18,313 కరోనా కేసులు

భారత దేశంలో గత 24గంటల్లో 18,313 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,026 కు చేరింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.47శాతంగా వుంది. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ డోసులు 202.79 కోట్లు పూర్తయ్యాయి. 12-14 ఏళ్లలోపు వారికి 3.86 కరోనా డోసులు పూర్తయ్యాయి. 

09:45 AM (IST) Jul 27

హైదరాబాద్ లో శంకర్, రామ్ చరణ్ సినిమా షూటింగ్... అడ్డుకున్న బిజెపి కార్పోరేటర్

భారీ చిత్రాల దర్శకుడు శంకర్, హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో జరుగుతుండగా బిజెపి నాయకులు అడ్డుకున్నారు.  సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్లో ఓవైపు విద్యార్థులకు క్లాసులు జరుగుతుండగా మరోవైపు షూటింగ్ జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. వెంటనే షూటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసారు.  

09:37 AM (IST) Jul 27

సోనియా గాంధీకి ఈడీ విచారణ... ఏఐసిసి కార్యాలయం వద్ద 144సెక్షన్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాళ (బుధవారం) మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు పిలుపునివ్వడంతో డిల్లీ పోలీసులు ఏఐసిసి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. అక్బర్ రోడ్డులో భారీకేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు కాంగ్రెస్ జాతీయ కార్యాలయం వద్ద 144సెక్షన్ విధించారు. 

09:26 AM (IST) Jul 27

రాజస్థాన్ లో భారీ వర్షాలు... వరదలకు నలుగురు చిన్నారులు బలి

రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నలుగురు చిన్నారులు బలయ్యారు. జోద్ పూర్ లో భారీ వరద నీటిలో నలుగురు చిన్నారులు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇక భారీ వర్షాలతో జోద్ పూర్ జిల్లాలో పాటు భిల్వారా, చిత్తోర్ ఘడ్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యారు. రోడ్లపైకి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.