తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

04:57 PM (IST) Jul 18
భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్ లో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఈటల ఓటేసారు.
04:31 PM (IST) Jul 18
కరోనా నుండి ఇప్పుడిప్పుడే బయటపడి ప్రజలు నిర్భయంగా బయటకు వస్తున్న సమయంలో మరో మహమ్మారి భయం మొదలయ్యింది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన మంకీ పాక్స్ భారత్ కు చేరింది. ఇటీవల దక్షిణ భారతదేశంలోని కేరళలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదవగా తాజాగా రెండో కేసు కూడా అదే రాష్ట్రంలో వెలుగుచూసింది. ఇటీవలే దుబాయ్ నుండి కేరళకు వచ్చిన 31 ఏళ్ళ వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించారు.
03:56 PM (IST) Jul 18
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 760 పాయింట్లు లాభాలతో 54,521 దగ్గర ముగిసాయి. ఇక నిప్టీ 229 పాయింట్ల లాభంతో 16,278 వద్ద ముగిసాయి.
03:36 PM (IST) Jul 18
మధ్యప్రదేశ్ లో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతపపి నర్మదా నదిలోకి దూసుకెళ్ళిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 12 మంది నదిలో మునిగి మృతిచెందగా 15 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది.
02:23 PM (IST) Jul 18
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంరోజే విపక్షాల ఆందోళనతో లోక్ సభ దద్దరిల్లింది. గతకొంతకాలంగా భారీగా పెంచుకుంటూ వస్తున్న వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని... దీనిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలో ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసారు. ఇప్పటికే రాజ్యసభ రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
02:19 PM (IST) Jul 18
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ తో కలిసివచ్చిన సీఎం కేసీఆర్ ఓటేసారు.
01:38 PM (IST) Jul 18
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు ఓటేసారు. అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఓటేసారు.
01:24 PM (IST) Jul 18
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తెలంగాణ, ఏపీ ఎంపీలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇరు రాష్ట్రాల ఎంపీలు పార్టీల వారిగా బృందాలుగా కలిసివెళ్లి ఓటేసారు.
12:49 PM (IST) Jul 18
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ ఖడ్ నామినేషన్ దాఖలుచేసారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన ధన్ ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు.
12:27 PM (IST) Jul 18
జగన్ సర్కార్ కు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. కోవిడ్ కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారంటూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. కోవిడ్ నిధులు దారిమళ్లినట్లు నిర్దారించిన సుప్రీం వైసిపి ప్రభుత్వాన్ని ఎస్డీఆర్ఎఫ్ నిధులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. పిడి ఖాతాల్లోకి మళ్లించిన సుమారు రూ.1,100 కోట్లు నిధులను రెండు వారాల్లో తిరిగివ్వాలని సుప్రీం కోర్టు గడవు విధించింది.
12:09 PM (IST) Jul 18
భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న పోలింగ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటేసారు. డ్రాప్ బాక్స్ లో బ్యాలెట్ పేపర్ వేయకముందే పొరపాటును గుర్తించిన సీతక్క మరో బ్యాలెట్ పేపర్ ను ఎన్నికల అధికారులను కోరారు.
11:39 AM (IST) Jul 18
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్ నుండి పుణేకు 51 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. ధార్ జిల్లా ఖల్ ఘాట్ దగ్గర బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా నీటమునిగారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీసారు. మృతుల సంఖ్య భారీగా వుండే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
11:10 AM (IST) Jul 18
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అటు లోక్ సభ ఇటు రాజ్యసభ నూతనంగా ఎన్నికయిన ఎంపీల ప్రమాణస్వీకారంతో ప్రారంభమయ్యాయి.
11:06 AM (IST) Jul 18
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అమరావతిలోకాకుండా హైదరాబాద్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
10:48 AM (IST) Jul 18
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ తో పాటు అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలోనే రాష్ట్రంలోని మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు.
10:41 AM (IST) Jul 18
భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో అతి ప్రధానమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసారు.
10:36 AM (IST) Jul 18
తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ భవన్ నుండి ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపట్లో ఓటేయనున్నారు.
10:24 AM (IST) Jul 18
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో వైసిపి ఎమ్మెల్యేలతో కలిసివచ్చిన సీఎం ఓటేసారు.
10:13 AM (IST) Jul 18
రాష్ట్రపతి ఎన్నికకు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష టిడిపి కూడా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతివ్వడంతో క్రాస్ ఓటింగ్ సమస్య వుండకపోవచ్చు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు మాత్రం ఆ భయం వెంటాడుతోంది. ఎన్డీఏ గిరిజన అభ్యర్థిని బరిలోకి దించడంతో కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అటువైపు మొగ్గుచూపే అవకాశాలుండటంతో టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు చేపట్టింది. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాక్ పోలింగ్ నిర్వహించి ఈ ఆ తర్వాత ప్రత్యేక బస్సులో ఎమ్మెల్సేలు అందరినీ అసెంబ్లీలోని పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది.
10:05 AM (IST) Jul 18
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,935 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఒక్కరోజే 51మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపితే దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,44.264 కు చేరింది.
09:48 AM (IST) Jul 18
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజాగ్రహం పెల్లుబకడంతో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి రాజీనామా చేయడం... దేశంలో పరిస్థితి, పాలన అదుపుతప్పడం ఎమర్జెన్సీ విధించారు. ఎల్లుండి కొత్త అధ్యక్షున్ని ఎన్నుకునే వరకు దేశంలో ఈ ఎమర్జెన్సీ కొనసాగనుంది. సోమవారం నుండే ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.
09:23 AM (IST) Jul 18
తెలంగాణలో ఇవాళ (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.