ఒకే కుటుంబంలోని ముగ్గురి కాల్చివేత: కోడలి సోదరులపై అనుమానాలు..?

By Siva KodatiFirst Published Nov 11, 2020, 11:13 PM IST
Highlights

చెన్నైలో దారుణం జరిగింది. నగరంలో షావుకార్ పేటలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. 

చెన్నైలో దారుణం జరిగింది. నగరంలో షావుకార్ పేటలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను డాలీచంద్ (74), అతని భార్య పుష్పా బాయి (70), వీరి కుమారుడు శీతల్ (42) గా గుర్తించారు. వీరు రాజస్థాన్‌లోని జవాల్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.

డాలీ చంద్ నగరంలో ఓ ఫైనాన్సింగ్ సంస్థను నడుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇతని కుటుంబం షౌవుకార్ పేటలోని వినాయగ మాస్త్రీ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.

అక్కడికి దగ్గరలో నివసిస్తున్న డాలీ చంద్ కుమార్తె పింకీ తన తండ్రికి ఫోన్ చేయగా.. ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తుకు వచ్చింది.

లోపల కూడదా ఎలాంటి అలికిడి లేకపోవడంతో బెడ్‌రూమ్‌కి వెళ్లి చూడగా అక్కడ ముగ్గురు రక్తపు మడుగులో శవాలుగా కనిపించారు. దీంతో పింకీ ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పింది.

వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎలిఫెంట్ గేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులను దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లోనే కాల్చి చంపారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించడంతో చెన్నై పోలీస్ కమీషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ తదితర ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు.

ఫింగర్ ప్రింట్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరిస్తుండగా.. డాగ్ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. పూణేకు చెందిన జయమాలను దాలీ చంద్ కుమారుడు శీతల్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 13, 11 సంవత్సరాలున్న ఇద్దరు కుమార్తెలు వున్నారు.

శీతల్, జయమాలాలు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జయమాల కుటుంబసభ్యులు శీతల్ కుటుంబం నుంచి కొంత మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.     

దీనిలో భాగంగానే జయమాల సోదరులు వికాస్, కైలాష్‌లు తరచుగా డాలీ చంద్ ఇంటికి వెళ్లి డబ్బు డిమాండ్ చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం వికాస్, కైలాష్‌లను చూసినట్లు ఇరుగుపొరుగు వారు దర్యాప్తు అధికారులకు చెప్పారు.

వీరిద్దరూ డాలీ చంద్ కుటుంబంతో వాదనకు దిగారని కూడా తెలుస్తోంది. ఈ ముగ్గురి హత్యలో వికాష్, కైలాష్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన దగ్గరలోని నివాసాలు, దుకాణాల నుంచి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌‌లను పరిశీలిస్తున్నారు. 

click me!