డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పై భజరంగ్ పూనియా స్పందన ఇదే.. పద్మ శ్రీ వెనక్కి తీసుకుంటారా ?

By Sairam Indur  |  First Published Dec 24, 2023, 2:19 PM IST

సంజయ్ సింగ్ (sanjay singh) ఆధ్వర్యంలోని డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ (WFI Panel) ను రద్దు (suspend) చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ (Sports Ministry) తీసుకున్న నిర్ణయాన్ని రెజ్లర్ భజరంగ్ పూనియా స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.


Bajrang Punia : 

ఇటీవలే ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ మాజీ ఆఫీస్ బేరర్ల పూర్తి నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తోందని, నిబంధనలు ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ప్రభుత్వం డబ్ల్యూఎఫ్ఐని తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ పతక విజేత భజరంగ్ పూనియా స్వాగతించారు.

Latest Videos

కేంద్ర మంత్రిత్వ శాఖ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. బ్రిజ్ భూషణ్, ఆయన సన్నిహితులను రెజ్లింగ్ సంఘం నుంచి ప్రభుత్వం దూరంగా ఉంచాలని తెలిపారు. అలా చేస్తే తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆదివారం ‘ఆజ్ తక్’ తో అన్నారు. ‘‘మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మా ప్రాంతాన్ని బట్టి మమ్మల్ని విడదీశారు. హరియాణా వర్సెస్ యూపీలా చిత్రీకరించారు. మేము దేశం కోసం మాత్రమే పతకాలు గెలుస్తాము. అందరినీ బెదిరించారు. ప్రభుత్వం కంటే బ్రిజ్ భూషణ్ పెద్దవాడా’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మా స్టాండ్ అలాగే ఉంది. బ్రిజ్ భూషణ్, ఆయన అనుచరులు డబ్ల్యూఎఫ్ఐలో భాగం కాకూడదు. ప్రతీ రాష్ట్ర సంఘంలోనూ ఆయన మనుషులు ఉంటారు.’’అని భజరంగ్ పూనియా ఆరోపించారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్లను దేశద్రోహులుగా ముద్ర వేసిన వారంతా బ్రిజ్ భూషణ్ కోసం పనిచేస్తున్నారని అన్నారు. పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘దేశం కోసం మేం చేసిన కొన్ని మంచి పనుల వల్లే ప్రభుత్వం మాకు అవార్డు ఇచ్చింది. తప్పకుండా వెనక్కి తీసుకుంటాం. ట్రోలర్స్ మమ్మల్ని దేశ ద్రోహులు అని పిలుస్తున్నారు. ఎందుకు ? మా రక్తాన్ని, చెమటను దేశానికి ఇచ్చాం. ఈ ట్రోలర్స్ అంతా బ్రిజ్ భూషణ్ సింగ్ మద్దతుదారులే. మా పై ముద్ర వేయడానికి ఈ ట్రోల్స్ ఎవరు? ’’ అని ప్రశ్నించారు. 

ఉత్తర ప్రదేశ్ రెజ్లింగ్ సంఘం మాజీ చీఫ్, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గత గురువారం డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీనిపై రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించారు. ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంజయ్ సింగ్ ఎన్నిక పట్ల కన్నీటి పర్యంతమయ్యారు. రెజ్లింగ్ నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు. బ్రిజ్ భూషణ్, ఆయన అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని సాక్షి స్పష్టం చేశారు. అలాగే భజరంగ్ పూనియా కూడా తన పద్మ శ్రీని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. 

click me!