
CAA-Supreme court: పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సెప్టెంబర్ 12న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వాలని పేర్కొంది. అయితే, సీఏఏపై పలు వర్గాల నుంచి వ్యతిరేక వచ్చింది. దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అనేక చోట్ల పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. అయితే, చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ 2019 డిసెంబర్ 18న పిటిషన్లపై సుప్రీంకోర్టు (ఎస్సీ) కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
సీఏఏ రాజ్యాంగబద్ధతపై విచారణ
సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ప్రధాన పిటిషన్‌తో సహా 220 పిటిషన్లను సెప్టెంబర్ 12న విచారణకు లిస్ట్ చేసింది. డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశంలోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్సీ వర్గాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కోసం సవరించిన చట్టంకు సంబంధించినది.
సుప్రీంకోర్టు నోటీసులు..
సీఏఏకు సంబంధించి 2020 జనవరి రెండో వారంలోగా సమాధానం చెప్పాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై నోటీసులు జారీ చేస్తూ, చట్టంపై పౌరులకు అవగాహన కల్పించేందుకు ఆడియో-విజువల్ మాధ్యమాన్ని ఉపయోగించడాన్ని పరిశీలించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరింది. ఈ క్రమంలోనే సీఏఏ అమలుపై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు చెప్పింది.
ముస్లిం లీగ్ పిటిషన్‌లో ఏముంది?
సీఏఏను సవాల్ చేస్తూ పిటిషనర్లలో ఒకరైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) తన పిటిషన్‌లో సమానత్వం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందనీ, మతం ఆధారంగా బహిష్కరించడం ద్వారా అక్రమ వలసదారులకు ప్రధాన కారణాలలో ఒకటని పేర్కొంది. అందరికి సమానంగా పౌరసత్వం కల్పించాలని కోరింది.
దేశవ్యాప్తం నిరసనలు..
అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరతస్వ (సవరణ) చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. నిరసనకారుల ఆందోళనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరసనలు వేగంగా చెలరేగాయి . జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసనలు, గౌహతి, మేఘాలయ, కేరళ, షాహీన్ బాగ్ (న్యూఢిల్లీ), కోల్‌కతాలు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక నిరసనలు తీవ్ర ఉద్రిక్తలకు కారణమయ్యాయి. డిసెంబర్ 2019లో ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసు కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈశాన్య భారతంలో సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. గత నెలలో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతంల్లో అనేక విద్యార్థి సంస్థలు సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలను మళ్లీ షురు చేశాయి.