బిజెపికి బిగ్ షాక్... శివసేన బాటలోనే అకాలీదళ్, ఎన్డీఏ నుండి బైటకు

By Arun Kumar PFirst Published Sep 27, 2020, 8:14 AM IST
Highlights

ఇప్పటికే పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయిన బిజెపి-శిరోమణి అకాలిదళ్ కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది.

చండీఘడ్: ఇప్పటికే పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయిన బిజెపి-శిరోమణి అకాలిదళ్ కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) నుంచి తప్పుకుంటున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్ భీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల గురించి చర్చించేందుకు అకాలిదళ్ పార్టీ ప్రధాన కమిటీ శనివారం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు సుఖ్‌బీర్ సింగ్ బాదల్. రైతులను నష్టం చేకూర్చేలా వ్యవసాయ బిల్లులు వున్నాయని... కాబట్టి వారికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నుండి వైదొలగాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

READ MORE  వ్యవసాయ బిల్లుల ఆమోదం: పంజాబ్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై, మార్కెటింగ్ పై భరోసా ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ పార్టీ వర్గాలు వెల్లడించారు. ఇదే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్సీమ్రాత్ బాదల్ ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  

వ్యవసాయ రంగానికి ెచందిన బిల్లలను లోకసభలో ఆమోదించడానికి కొద్ది గంటల ముందు ఆమె రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో తాము ఎన్డీఎ ప్రభుత్వానికి, బిజెపికి మద్దతు కొనసాగిస్తామని ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ బాదల్ చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

హర్యానా, పంజాబ్ రైతులు కొన్ని వారాలుగా నిరసనలు తెలుపుతున్నారని, ఈ బిల్లులు ఈ రాష్ట్రాల రైతులను నిరాశకు గురి చేస్తాయని ఆయన అన్నారు. ఆ చట్టాలను తొలుత శిరోమణి అకాలీదళ్ బలపరిచింది. అయితే, నష్టం జరిగే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గింది. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బిల్లులను ఆపాలని అకాలీదళ్ కోరింది. అయితే బిజెపి వినలేదు. దీంతో పార్టీ కమిటీ నిర్ణయం మేరకు ఎన్డీఏ నుండి వైదొలగాలని సుఖ్ బీర్ సింగ్ బాదల్ తాజాగా ప్రకటించారు. 

 


 

click me!