ఒక టీస్పూన్ మట్టిలో ప్రపంచంలోని మనుషుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని మీకు తెలుసా? సద్గురు జగ్గీ వాసుదేవన్ సేవ్ సాయిల్ మూమెంట్ లో భాగంగా.. మట్టిగురించి అనేక ముఖ్యమైన అంశాలు తెలియజేశారు.
70 రోజుల పాటు రోడ్డుయాత్రం తరువాత ఆధ్యాత్మిక గురువు, సద్గురు మే 29న భారత్ లో సేవ్ సాయిల్ యాత్ర చివరి దశ కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుంటారు. గత రెండు నెలలుగా, సేవ్ సాయిల్ అంటూ... సద్గురు బైక్‌పై ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సద్గురు ఈ యాత్ర గురించి ఏం చెబుతున్నారంటే.. "ఈ గ్రహం మీద మట్టి అక్షరాలా జీవవైవిధ్యానికి తల్లి. సుసంపన్నమైన నేల లేకుండా, జీవవైవిధ్యానికి అవకాశం లేదు. ఈ గ్రహం మీద జీవానికి జన్మనిచ్చే గర్భం మట్టి" అన్నారు.
మట్టి గురించి ప్రతీఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన 15 ముఖ్యమైన విషయాలు ఇవి:
1) మనం తినే ఆహారంలో 95 శాతం మట్టి నుండే వస్తుంది.
2) భూమి పైభాగంలోని ఆరు అంగుళాల మట్టిలో ఒక శాతం సేంద్రీయ పదార్థాలను పెంచడం వల్ల ఎకరాకు 20,000 గ్యాలన్ల నీటిని పట్టి ఉంచొచ్చు.
3) నేల క్షీణత అనేది ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ల ప్రజలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
4) ఒక గ్రాము ఆరోగ్యకరమైన నేలలో, 100 మిలియన్ నుండి 1 బిలియన్ వరకు బ్యాక్టీరియా, 100,000 నుండి 1 మిలియన్ శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదల, ఆరోగ్యానికి తోడ్పడతాయి.
5) మనం ఇప్పుడు చర్య తీసుకోకపోతే, 2050 నాటికి భూమి మీది 90 శాతం నేలలు క్షీణించవచ్చు.
6) 0.5 నుండి 3 శాతం వరకు నేలలో సేంద్రియ పదార్ధాలను పెంచడం వలన నేలలో నిల్వ చేయబడే నీరు రెట్టింపు అవుతుంది.
7) భూసారం క్షీణించడం వల్ల భూగ్రహం మీద పెరిగే వృక్షసంపదలో ఇరవై శాతం ఉత్పాదకత పడిపోతుంది.
8) ప్రపంచ జనాభాలో అరవై శాతం ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం భూసారం, ఆహారంలో పోషకాలు లోపించడమే.
9) ఒక టీస్పూన్ మట్టిలో ప్రపంచంలోని మనుషుల కంటే ఎక్కువ జీవులు ఉంటాయి. ఒక టీస్పూన్ ఆరోగ్యకరమైన నేలలో దాదాపు 10,000-50,000 సూక్ష్మజీవుల జాతులు ఉన్నాయి.
10) ఇది ఇలాగే ఉంటే ప్రపంచంలోని మొత్తం మట్టి 60 ఏళ్లలో కనిపించకుండా పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 మిలియన్ హెక్టార్ల భూసారం తగ్గిపోతోంది. ఇది దాదాపు గ్రీస్ దేశం మొత్తం పరిమాణం అంత ఉంటుంది.
11) ప్రపంచంలోని 90% వ్యవసాయానికి కావాల్సిన నీటికి నేలే ఆధారంగా ఉంది. కానీ ఇప్పటికే 52 శాతం వ్యవసాయ నేల క్షీణించింది.
12) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే అనేక యాంటీబయాటిక్స్ మట్టినుంచి ఉద్భవించిన సూక్ష్మజీవుల నుంచే తయారుచేయబడ్డాయి. అందులో ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ కూడా ఉంది.
13) వానపాముల ఉనికి 43-350% దిగుబడిని పెంచుతుంది.
14) మట్టిలో కార్బన్‌ను కేవలం 0.4% పెంచితే ఆహారధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం 1.3% పెరుగుతుంది.
15) UN అంచనాల ప్రకారం, మట్టిని పునరుజ్జీవింపజేయడం వల్ల మానవాళి ప్రస్తుత వార్షిక గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 25-35 శాతం తగ్గించవచ్చు.
(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో)