పంతం నెగ్గించుకున్న రాహుల్, ప్రియాంక: హత్రాస్ వెళ్లేందుకు అనుమతి

By Siva KodatiFirst Published Oct 3, 2020, 4:27 PM IST
Highlights

హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పోలీసులు అనుమతినిచ్చారు.

హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పోలీసులు అనుమతినిచ్చారు. వీరిద్దరితో సహా మరో ముగ్గురికి కూడా పోలీసులు అనుమతించారు.

ఇదే సమయంలో హత్రాస్‌లో 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. అంతకుముందు ఢిల్లీ- నోయిడా జాతీయ రహదారిపై రాహుల్, ప్రియాంకల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అయితే కాంగ్రెస్ శ్రేణులు భారీగా రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దు:ఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తి నన్ను అడ్డుకోలేదని హత్రస్ బయల్దేరే ముందు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అటు ఈ దారుణం వెలుగుచూసిన తర్వాత తొలిసారిగా గ్రామంలోకి మీడియాను అనుమతించారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో మీడియా ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

దీంతో గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు.. బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతానికి మీడియాను మాత్రమే అనుమతించామని.. పై అధికారుల ఆదేశాలు అందిన తర్వాత ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు.

బాధిత కుటుంబసభ్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ కూడా ఇవాళ హథ్రాస్‌లో పర్యటించనున్నారు.

అటు ఈ దారుణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం.. బాధితురాలి కుటుంబానికి నార్కోటిక్ ఎనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు ఈ ఘటనలో విధులు సక్రమంగా నిర్వహించని ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 

click me!