
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి నిబంధనలను ఉల్లంఘించింది. పాక్ కు చెందిన ఓ హెలికాప్టర్ ఆదివారం నాడు భారత గగనతలంలోకి ప్రవేశించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని ఎల్ఓసీ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.
భారత్, పాక్ నియంత్రణ రేఖను దాటి కృష్ణఘటి సెక్టార్‌లోని గుల్పర్ ప్రాంతంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 12.13 నిమిషాలకు పాక్ కు చెందిన హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించింది.
ఈ విషయాన్ని భారత రక్షణశాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఆ సమయంలో హెలికాప్టర్ వెళ్తున్న మార్గం వైపు భారత జవాన్లు కాల్పులు జరిపి పైలెట్‌ను హెచ్చరించినట్టు కూడ రక్షణశాఖాధికారులు ప్రకటించారు.
దీంతో హెలికాప్టర్ ను పైలెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపుకు మళ్లించారని రక్షణశాఖాధికారులు ప్రకటించారు. భారత్ పొరుగు దేశంతో శాంతియుతంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలకు భంగం వాటిల్లేలా చేస్తోందని రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.