
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ రోజు రాజ్యసభ(Rajya Sabha)లో మాట్లాడుతూ కాంగ్రెస్(Congress)పై మండిపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) తీరుపైనా విరుచుకుపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ శాంతికాముకుడు అనే తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని గోవా మండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపణలు సంధించారు. ఆయన తన సొంత ఇమేజ్ కోసం పాకులాడిన కారణంగానే భారత్‌కు స్వాతంత్ర్యం లభించినా గోవా మాత్రం మరికొన్నేళ్లు పరాయి పాలనలోనే మగ్గిపోవాల్సి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ఈ రోజు రాజ్యసభలో మాట్లాడారు.
భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించింది. కానీ, గోవాకు మాత్రం ఇంకా బానిస సంకెళ్లలోనే ఉండిపోయింది. బ్రిటీషర్లు భారత్ వదిలి వెళ్లారు. కానీ, గోవాలోని పోర్చుగీసు పాలకులు ఇంకా వెళ్లలేదు. గోవా ప్రజలు వారి నుంచి విముక్తి కోసం సత్యాగ్రహం చేశారు. గోవా విముక్తి కోసం జరుగుతున్న పోరాటాలకు స్వాతంత్ర్యం పొందిన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దన్నుగా నిలబడలేదు. నెహ్రూ మూలంగానే గోవాకు స్వేచ్ఛ మరికొన్నేళ్లకు గాని దక్కలేదని ప్రధాని తాజాగా విమర్శించారు.
‘గోవా విముక్తి పొంది ఈ ఏడాదితో 60 ఏళ్లు. హైదరాబాద్, జునాగడ్‌లకు విముక్తి కల్పించడంలో సర్దార్ పటేల్ అవలంబించిన విధానాల నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే గోవా మరో 15 ఏళ్లు బానిసగా ఉండాల్సిన అవసరం లేకుండేది. సర్దార్ పటేల్ మార్గంలో నడిచి ఉంటే గోవాకు ముందే పోర్చుగీసువారి నుంచి విముక్తి లభించేది. అప్పటి వార్తా పత్రికలను గనుక గమనిస్తే.. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన ఇంటర్నేషనల్ ఇమేజ్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డట్టు అర్థం అవుతుంది. గోవాను పీడిస్తున్న విదేశీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే.. అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న శాంతికాముకుడు అనే పేరు దెబ్బతింటుటుందని నెహ్రూ ఆలోచించారు. అందుకే గోవాను దాని వేదనకే వదిలిపెట్టాడు. తోటి పౌరులు, సత్యాగ్రహులపై కాల్పులు జరుగుతుంటే.. నేను అక్కడకు ఆర్మీని పంపేది లేదని నెహ్రూ చెప్పారు’ అని ప్రధాని మోడీ అన్నారు. 1955లో నిర్వహించిన గోవా మార్చ్‌లో సత్యాగ్రహుల ప్రాణాలు పోవడాన్ని అడ్డుకోలేదని పేర్కొన్నారు.
‘1955 ఆగస్టు 15వ తేదీన లాల్ ఖిల్లా పై నుంచి దేశ పౌరులను ఉద్దేశిస్తూ నెహ్రూ ఇలా మాట్లాడారు. ‘‘గోవా కోసం మేం రహస్యంగా చర్యలు తీసుకుంటున్నామని భావించొద్దు. గోవా చుట్టూ మన బలగాలు లేవు. కొంతమంది మన భద్రతా బలగాలను గోవాకు పంపాలని గొడవ పెడుతున్నారు. కానీ, మేం ఫోర్స్‌ను పంపబోం. ఈ సమస్యను మేం శాంతియుతంగా పరిష్కరిస్తాం. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ ఈ ప్రకటన గోవా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే’ అని ప్రధాని మోడీ అన్నారు.
‘నెహ్రూ అప్పుడు మాట్లాడిన విషయాలే మరికొన్ని చెబుతాను. ‘‘అక్కడకు వెళ్లాలనుకుంటున్నవారిని అడ్డుకోం. కానీ, సత్యాగ్రహి అని పిలుచుకునేవారు సత్యాగ్రహ సూత్రాలను గుర్తుంచుకోవాలి. బలగాలను పంపండమనేది సత్యాగ్రహ కాదు’ అని నెహ్రూ అన్నారు’ అని ప్రధాని మోడీ గుర్తు చేశారు. నెహ్రూ చూపించిన ఈ అహంకారమే గోవా ప్రజలకు మరికొన్నేళ్ల పాటు స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశం లేకుండా చేసిందని ఆరోపించారు.
అదే సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీపైనా విమర్శలు గుప్పించారు. నెహ్రూను విమర్శించినందుకే మజ్రూహ్ సుల్తాన్‌పురి, ప్రొఫెసర్ ధరమ్‌పాల్‌లను జైలు పాలు చేశారని విమర్శించారు.