Published : Oct 24, 2022, 09:18 AM ISTUpdated : Oct 24, 2022, 05:16 PM IST

Telugu News Live : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 

Telugu News Live :  నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

03:38 PM (IST) Oct 24

చేనేతపై జీఎస్టీ రద్దుకు పోస్ట్ కార్ట్ ఉద్యమం... ప్రధానికి తెలంగాణ మంత్రి లేఖ

చేనేత పై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా తన స్వదస్తూరీతో లేఖ రాసిన మంత్రి కేటీఆర్ దీన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధానికి భారీగా లేఖలు రాస్తున్నారు. ఇలా తాజాగా కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి లేఖ రాసారు. 

02:22 PM (IST) Oct 24

మునుగోడులో కోటిన్నర నగదు సీజ్..: ఎన్నికల అధికారి వెల్లడి

మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. ఎక్కడికక్కడ పోలీసులు ధనం, మద్యం ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని... ఇప్పటివరకు తనిఖీల్లో 1,48,44,160 రూపాయిలు సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే లక్ష రూపాయల విలువైన మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రోహిత్ సింగ్ తెలిపారు. 

12:54 PM (IST) Oct 24

గవర్నర్ కు వీసీలను రాజీనామా చేయమనే అధికారమే లేదు...: కేరళ సీఎం విజయన్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసిలను రాజీనామా చేయాలని ఆదేశించే అధికారం గవర్నర్ కు లేదని సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య యుతంగానూ గవర్నర్ వ్యవహరించాలని కేరళ సీఎం విజయన్ సూచించారు. 


 

12:28 PM (IST) Oct 24

సోమాలియాలో ఉగ్రదాడి ... కారు బాంబు పేలుడులో 9 మంది మృతి

సోమాలియాలో ముష్కరమూకలు రెచ్చిపోయాయి. కిస్నాయు సిటీలో ఓ హోటల్ వద్దకు బాంబును అమర్చిన కారును తీసుకెళ్లి ఒక్కసారిగా పేల్చారు. ఈ ఘటనలో 9 మంది అక్కడిక్కడే మృతిచెంగా మరో 47మందికి తీవ్ర గాయాలయ్యాయి.  

 

11:36 AM (IST) Oct 24

రవితేజ 'రావణాసుర' మూవీ రిలీజ్ కు ముహూర్తం ఖరారు...

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'రావణాసుర' మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  సినిమా రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ను రవితేజ స్వయంగా ప్రకటించారు. 
 

10:57 AM (IST) Oct 24

బ్రిటన్ ప్రధాని పదవికి మరింత చేరువైన రిషి సునక్...

బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి పొలిటీషన్ రిషి సునక్ ముందంజలో వున్నారు. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నుండి పోటీకి ఆసక్తి చూపిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రుషి సునక్ ఎన్నికకు మార్గం మరింత సుగమయ్యింది. 150కి పైగా ఎంపీల మద్దతు కలిగిన రిషి బ్రిటన్ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. 


 

10:12 AM (IST) Oct 24

భారత సైనికులతో ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్... కార్గిల్ చేరుకున్న మోదీ

దేశ రక్షణలో భాగంగా కుటుంబాలకు దూరంగా వుంటున్న సైనికులతో ప్రధాని నరేంద్ర దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కార్గిల్ కు చేరుకున్న ప్రధాని అక్కడ భారత సైన్యంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోనున్నారు. 
 

09:31 AM (IST) Oct 24

బంగాళాఖాతంలో సిత్రాంగ్ తుఫాను... రేపే తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి థాయ్ లాండ్ సూచించిన ''సిత్రాంగ్'' గా నామకరణం చేసారు.  ఈ సిత్రాంగ్ తుఫాను ఇవాళ తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను బంగ్లాదేశ్ వైపు పయనించి రేపు(మంగళవారం) తీరం దాటనున్నట్లు ఐఎండి ప్రకటించింది. 

09:18 AM (IST) Oct 24

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అలాగే తెలుగు ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 


More Trending News