మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు రోడ్డుపైనే వదిలి ఆటోలో ప్రయాణించిన మెర్సిడెస్ బెంజ్ సీఈవో.. ఎందుకో తెలుసా?

By Mahesh KFirst Published Sep 30, 2022, 11:55 PM IST
Highlights

మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో నడి రోడ్డుపై తన ఎస్ క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కారును వదిలి ఓ ఆటో ఎక్కారు. ఆటోలోనే తన గమ్యాన్ని చేరుకున్నారు. ఎందుకో ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి వివరించారు.

న్యూఢిల్లీ: మెర్సిడెస్ కార్లు లగ్జరీగా ఉంటాయి. విలాసవంతంగా ఉండే ఆ కారు ఎక్కితే చాలు అని చాలా  మంది అనుకుంటారు. అలాంటి కారులో ప్రయాణిస్తేనా.. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ‘నాకు ఓకే’ అనే బాపతు చాలా మంది ఉంటారు. కానీ, నిజంగా మెర్సిడెస్ కారు ఓనర్ అలానే ఫీల్ అవుతారా? ఓనర్ కాదు.. ఏకంగా ఆ కంపెనీ ఇండియా విభాగానికి ఓనర్ ఏం చేసి ఉంటాడు? ఈ సందేహానికి సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా ఆయనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం పదండి..

మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్. 2006 నుంచి ఆయన ఈ కంపెనీలో పని చేస్తున్నారు. 2018లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు చైనాలో మెర్సిడెస్ బెంజ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా చేశారు. ఆయన తాజాగా, ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు.

ఆయన తన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారులో బయటకు వచ్చారు. కానీ, పూణెలో రోడ్డు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన కారు దిగి కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత ఓ ఆటో రిక్షాలో ఎక్కి గమ్యం చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు.

ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘మీ ఎస్ క్లాస్ కారు అద్భుతమైన పూణె రోడ్లపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? బహుశా కారు దిగి కొన్ని కిలో మీటర్లు నడిచి ఆ తర్వాత రిక్షా ఎక్కుతారా?’ అంటూ క్యాప్షన్ జోడించారు.

ఈ పోస్టు చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫాలోవర్లు తమ లైక్‌లు, కామెంట్లతో పోటెత్తారు. ‘నీవు అదృష్టవంతుడివి. అందరికీ గమ్యం తీసుకెళ్లడానికి అంగీకరించే ఆటో డ్రైవర్లు దొరుకరు’ అంటూ ఓ యూజర్ ఆటో డ్రైవర్లపై సెటైర్ వేశారు. ఒకరేమో ‘అయినా.. నేను ఎస్ క్లాస్‌లోనే కూర్చుని దాని అద్భుతమైన కంఫర్ట్‌ను ట్రాఫిక్‌లోనూ ఎంజాయ్ చేసేవాడిని’ అని రాసుకొచ్చారు.

click me!