
KS Eshwarappa Resigns : అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో ప్రమేయముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేత, కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం.. బెంగుళూరులోని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో సమావేశమైన తర్వాత.. ఈశ్వరప్ప తన రాజీనామాను సమర్పించారు. కాంట్రాక్టర్ మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఈశ్వరప్ప ఖండించారు.
ఇది ఆత్మహత్యా లేక హత్యా.. దీనిపై విచారణ జరగాలి.. ఈశ్వరప్ప చేసిన తప్పేమీ లేదు.. దోషులను గుర్తించి శిక్షించాలి. హత్య అయితే, హంతకులకు న్యాయం చేయాలి, ఈ విషయంలో ఒక శాతం నేరం ఉంటే, నా కుటుంబ దేవత నన్ను శిక్షిస్తుంది," అన్నారాయన. ఈ సందర్భంగా సీఎం నివాసంలో కేఎస్ ఈశ్వరప్పతోపాటు మంత్రులు బైరతి బసవరాజ, ఎంటీబీ నాగరాజ్, ఆరగ జ్ఞానేంద్ర, ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి తదితరులు ఉన్నారు.
అయితే రాజీనామా చేసే ముందు ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిర్దోషిగా వస్తాననీ, మళ్లీ మంత్రినవుతానని తెలిపారు. కాంట్రాక్టర్ సంతోష్ సూసైడ్ నోట్‌లో తన పేరు ఉండటం కుట్ర అని అన్నారు. ‘నాపై ఆరోపణ మోపారు. వాటిని క్లియర్ చేసుకోవాలి కదా. నిర్దోషిగా బయటకు రావాలి కదా. ఒకవేళ మంత్రి పదవిలో కొనసాగితే.. నేను విచారణను ప్రభావితం చేశానన్న అపవాదు వస్తుంది. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. కానీ.. నేను నిర్దోషిగానే బయటికి వస్తా. మరోసారి మంత్రినవుతా’ అని ఈశ్వరప్ప పేర్కొన్నారు.
కాబట్టి ఆందోళన చెందవద్దని తన మద్దతుదారులను కోరారు. భారీ బలప్రదర్శనలో రాజీనామా చేయడానికి రాజధానికి వెళ్లినప్పుడు భారీ కార్ల కాన్వాయ్ తో కలిసి వెళ్లారు. ఆయన బలవంతపు రాజీనామాకు వ్యతిరేకంగా శివమొగ్గలో మద్దతుదారులు నిరసన తెలిపారు. "రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మరియు నాయకులందరూ నాకు ఫోన్ చేసి మద్దతు ఇస్తున్నారు. బిజెపి కార్యకర్త ఎవరూ ఇలాంటి తప్పు చేయరని విశ్వాసం వ్యక్తం చేశారు" అని ఈశ్వరప్ప అన్నారు.
మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక గత మూడు రోజుల క్రితం సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటంతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగింది. మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సంతోష్ పాటిల్ తన సుసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖ కోసం తాను చేసిన పనికి ₹ 4 కోట్ల బిల్లును క్లియర్ చేయడానికి "40 శాతం కట్ మనీష ఇవ్వాలని మంత్రి ఈశ్వరప్ప డిమాండ్ చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ₹ 4 కోట్ల ప్రాజెక్ట్ కోసం సంతోష్ పాటిల్‌కు మంత్రి మౌఖిక సూచన ఇచ్చినట్లు నివేదించబడింది. కానీ 18 నెలలు గడిచినా, ఎటువంటి చెల్లింపును అందుకోలేదు, దానిని పూర్తి చేయడానికి, అతను డబ్బు అప్పుగా తీసుకున్నాడు, తన భార్య యొక్క నగలను కూడా విక్రయించాల్సి వచ్చినట్టు కాంట్రక్టర్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కర్ణాటకలోని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయడంతోపాటు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.