
బెంగళూరు: అత్తవారింట్లో అల్లుడికి సకలమర్యాదలు లభిస్తూ వుంటాయి. అయితే ఈ అల్లుడికి మాత్రం అత్తవారింట్లో విచిత్రమైన మర్యాద లభించింది. ఆస్తి కోసం అల్లున్ని గదిలో బంధించి శారీరకంగా హింసించిందో అత్త. ఈ వేధింపులు భరించలేక సదరు అల్లుడు సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తోటహళ్లికి చెందిన ఆనంద్ కుమార్-నీలమ్మ భార్యాభర్తలు. ఆనంద్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయి సంసారాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడ అతడిపేరిట వున్న ఆస్తిని నాశనం చేస్తాడోనని భార్యా, అత్తింటివారు భయపడిపోయారు.
ఈ క్రమంలోనే అతడి పేరిట వున్న ఆస్తిని భార్య నీలమ్మ పేరిట మార్చాలని ఒత్తిడి తెచ్చారు. ఇలా భార్య నీలమ్మతో పాటు అత్త గంగమ్మ, బామ్మర్ది గంగరాజు ఆస్తి గురించి ఆనంద్ పై ఒత్తిడి తీసుకురావడమే కాదు గదిలో బంధించి శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఈ వేధింపులను తట్టుకోలేక ఆనంద్ దారుణానికి ఒడిగట్టాడు.
ఇంట్లో ఎవరూలేని సమయంలో తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ ఓ సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు ఆనంద్. అనంతరం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అత్తింటివారి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ లెటర్ లో రాసినట్లు సమాచారం.
ఆనంద్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ స్వాదీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కిందకుదింపి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.