కానరాని వాన.. పడిపోతున్న నీటిమట్టాలు: బిల్డింగ్‌ల నిర్మాణంపై నిషేధం

By Siva KodatiFirst Published Jun 28, 2019, 6:08 PM IST
Highlights

వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చెన్నై నగరంలో తీవ్ర నీటి సంక్షోభం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మద్రాస్‌కు సమీపంలోని బెంగళూరు నగరంలోనూ నీటి సంక్షోభం తీవ్రమవుతోంది

వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చెన్నై నగరంలో తీవ్ర నీటి సంక్షోభం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మద్రాస్‌కు సమీపంలోని బెంగళూరు నగరంలోనూ నీటి సంక్షోభం తీవ్రమవుతోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఐదేళ్ల పాటు బెంగళూరులో బహుళ అంతస్థుల నివాస భవనాల నిర్మాణాలను నిషేధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

నగరంలో ఇప్పటికే ఎన్నో అపార్ట్‌మెంట్లున్నాయని.. తాగునీరు తదితర ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వాటిని బిల్డర్లు విక్రయించేస్తున్నారని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పరమేశ్వర తెలిపారు.

నీటి కొరత నేపథ్యంలో నివాసితులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, ఆ నీటి వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే ఐదేళ్ల పాటు కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు నిరాకరించే ప్రతిపాదినను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ప్రభుత్వాధికారులు త్వరలో బిల్డర్లతో సమావేశమై.. దీనిపై ఒక నిర్ణయానికి వస్తారని.. తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరమేశ్వర స్పష్టం చేశారు.

కావేరీ ఐదో దశ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని.. అది కూడా నగర అవసరాలకు సరిపోదని.. 400 కిలోమీటర్ల దూరంలో శివమొగ్గ జిల్లాలోని లింగనమక్కి డ్యాం నుంచి నీరు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఐదేళ్ల తర్వాత వివిధ మార్గాల ద్వారా నగరంలో సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చే అవకాశముందని పరమేశ్వర చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో జల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కృష్ణభైరే గౌడ.

భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో 15 వేల చెక్‌డ్యాంలు నిర్మించి నీటి వనరులను కాపాడుకుంటున్నట్లు తెలిపారు. 

click me!