
Baramulla encounter: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తెల్లవారుజామున రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం తెల్లవారుజామున బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం)తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. బారాముల్లాలోని యెడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
"బారాముల్లా ఎన్‌కౌంటర్ అప్‌డేట్: ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అంతకుముందు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో "బారాముల్లా ఎన్‌కౌంటర్‌అప్‌డేట్: మరో ఉగ్రవాది హతమయ్యాడు. స్థానిక ఉగ్రవాదులు ఇద్దరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జేఎంతో సంబంధం కలిగి ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అనుసరించాల్సి ఉంటుంది-కాశ్మీర్ ఏడీజీపీ" అని పేర్కొంది.
అలాగే, శుక్రవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలోని చిత్రగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మంగళవారం కుల్గాం జిల్లా అవ్హోతు గ్రామంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తో కలిసి భారత సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలంలో రెండు ఏకే సిరీస్ రైఫిళ్లు, గ్రెనేడ్‌లు, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను కుల్గాంలోని టకియాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, మహ్మద్ ఆసిఫ్ వానీగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఇద్దరూ జైషే మహ్మద్‌కు చెందిన వారు.
అంతకుముందు, ఆదివారం కూడా జమ్మూకాశ్మీర్ కాల్పులు చోటుచేసుకున్నాయి. "కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ టెక్రి నార్ సమీపంలో ఆర్మీ-కుప్వారా పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. వారి వద్ద నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది" అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.