బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నానని ఆయన ‘ఎక్స్ ’ పోస్ట్ లో పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానని బీజేపీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రానున్న లోక్ సభ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనలేనని ఆయన పేర్కొన్నారు. బీహార్ రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహించి, లోక్ సభ, రాజ్యసభ సహా పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్న మోడీ బుధవారం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
‘‘గత 6 నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నాను. దాని గురించి ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాను. లోక్ సభ ఎన్నికల సమయంలో నేనేమీ చేయలేను. ప్రధానికి అన్ని విషయాలు చెప్పాను’’ అని సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |
undefined
కాగా.. సుశీల్ కుమార్ మోడీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయడంతో పాటు, ఆ రాష్ట్రంలో ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన బీహార్ రాజకీయ ముఖచిత్రానికి గణనీయమైన కృషి చేశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధానికి తెలియజేశానని, దేశానికి, బీహార్ కు, తమ పార్టీకి కృతజ్ఞతలు తెలిపానని మోడీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఆయన బీజేపీ సీనియర్ నేత కావడంతో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనలేనని తెలియజేశారు. అయితే సుశీల్ మోడీ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం బీజేపీ నేతల్లో విచారాన్ని నింపింది.