అంత్యక్రియల్లో తుస్సుమన్న తుపాకులు: పోలీసులపై సీఎం సీరియస్

By Siva KodatiFirst Published Aug 22, 2019, 3:26 PM IST
Highlights

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత జగన్నాథ్ మిశ్రా పట్ల ఆ రాష్ట్ర పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారు.బుధవారం ఆయన అంత్యక్రియల సమయంలో గౌరవవందనం సమర్పించేందుకు పోలీసులు తుపాకులు పేల్చగా.. అవి పేలలేదు. సుమారు 22 మంది పోలీసులు ఒకేసారి గాల్లో కాల్పులు జరపడానికి ప్రయత్నించగా అవి పేలలేదు. 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత జగన్నాథ్ మిశ్రా పట్ల ఆ రాష్ట్ర పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారు. గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మూడు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా సేవలందించిన మిశ్రా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం ఆయన అంత్యక్రియల సమయంలో గౌరవవందనం సమర్పించేందుకు పోలీసులు తుపాకులు పేల్చగా.. అవి పేలలేదు.

సుమారు 22 మంది పోలీసులు ఒకేసారి గాల్లో కాల్పులు జరపడానికి ప్రయత్నించగా అవి పేలలేదు. వెంటనే స్పందించిన ఓ పోలీసు అధికారి వాటిరి మరమ్మత్తు చేసేందుకు ప్రయత్నించారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ అధికారులపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమని.. తుపాకులు పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించనందుకు సుపౌల్ జిల్లా పోలీసు అధికారులను వివరణ కోరారు.

click me!