పంజాబ్ లో జూలై 1 నుంచి ఇళ్ల‌కు ఉచిత విద్యుత్.. ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

Published : Apr 16, 2022, 10:38 AM IST
పంజాబ్ లో జూలై 1 నుంచి ఇళ్ల‌కు ఉచిత విద్యుత్.. ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

సారాంశం

పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జూలై 1 నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు పంజాబ్ సమాచార పౌరసంబంధాల శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. 

పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారంతో నెల రోజులు పూర్తి అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. జులై 1 నుంచి ఈ ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పంజాబ్ సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.

2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉచిత విద్యుత్ వాగ్దానం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు దీనిని అమలు చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఇదే విష‌యంలో గ‌త మంగ‌ళ‌వారం సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. తమ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్ప‌బోతోంద‌ని అన్నారు. ఇటీవ‌లే AAP అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ కూడా పంజాబ్‌లో ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటన త్వరలో రావచ్చని ఆశాభావం వ్య‌క్తం చేశారు. చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడిన మ‌ల్వింద‌ర్ కాంగ్.. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంద‌ని అన్నారు. అది దాదాపుగా పూర్తి కావొస్తోంద‌ని, ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని చెప్పారు.

ఇదిలా ఉండగా పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులపై ‘‘ట్యూబ్‌వెల్ బిల్లులు’’ విధించనున్నట్లు తనకు తెలిసిందని భోలాత్‌లోని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖపాల్ సింగ్ ఖైరా శుక్రవారం ఆరోపించారు. ఈ మేర‌కు ట్విట్ల‌ర్ లో పోస్ట్ చేశారు. “భగవంత్‌మాన్ ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ చేయడానికి కొంటెగా వెళుతోందని నేను తెలుసుకున్నాను! వారు 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు ట్యూబ్‌వెల్ బిల్లులు విధించ‌నున్నారు. అలా పొదుపు చేసి అందులో నుంచి 300 యూనిట్లు ఉచితంగా ఇస్తారు ! ఈ ఉచిత విద్యుత్ హామీ ఇస్తున్న‌ప్పుడు అర‌వింద్ కేజ్రీవాల్ ఈ మోసాన్ని చెప్ప‌లేదు ! ’’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం వ్యవసాయ రంగానికి పంజాబ్ రాష్ట్రం ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తోంది. 

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మొద‌టి సారిగా అధికారంలోకి వ‌చ్చింది. అంత‌కు ముందు ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు, సీఎం బంధువుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు, ఇంకా ప‌లు కార‌ణాల వ‌ల్ల కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. ఢిల్లీలో అభివృద్ధిని న‌మూనాగా చూపుతూ.. పంజాబ్ లోనూ దీనినే అమ‌లు చేస్తామ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌చారం చేయ‌డం, 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి గ‌ట్టిగా పోరాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల ఆప్ అధికారంలోకి వచ్చింది. పార్టీ స్థాపించిన అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే రెండో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు ఆ పార్టీ కృష్టి చేస్తోంది. కాగా త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజరాత్ రాష్ట్రాల‌పై ఆప్ దృష్టి సారిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !