
దేశ రాజధాని న్యూడిల్లీలో నివసిస్తున్న మహిళలకు రూ. 2,5000 ఆర్థిక సహాయం అందించేందుకు డిల్లీ సర్కార్ సిద్దమయ్యింది. ఈ మేరకు మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం తెలిపేందుకు మహిళా దినోత్సవం రోజున రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీ కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వం మార్చి 9న అంటే రేపు ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎన్నికల ముందు మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది... కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఢిల్లీలోని మహిళలకు రూ. 2,500 ఇవ్వాలనేది మొదటి హామీ... దాన్ని నెరవేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా వికసిత్ భారత్ 2047 లో భాగంగా మహిళా శక్తిని ఉద్దేశించి సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ... మన దేశం బేటీ బచావో, బేటీ పడావోలో అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పుడు తాము మూడవ దశలో ఉన్నాము... బేటీ బడావో అమలుకు సిద్దమయ్యామన్నారు.ఇప్పుడు మహిళలు నిజమైన పాలకులుగా మారారు... బడ్జెట్‌ను సమర్పిస్తారు, విదేశీ వ్యవహారాలను నిర్వహిస్తారు, దేశాన్ని రక్షిస్తారని అన్నారు. ప్రతి రంగంలో తమకంటూ ఒక ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నారని సీఎం అన్నారు.
అంతకుముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ... ఢిల్లీ బడ్జెట్ ప్రజల అంచనాలను నెరవేరుస్తుందని, ఈ మేరకు ఆమె మహిళలు, కుటుంబాలు, యువత మరియు వివిధ రంగాల నిపుణులను కలుస్తానని అన్నారు. మేము మా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తాము, అది మహిళలందరికీ ఆర్థికసాయం పథకం అయినా లేదా సిలిండర్ అయినా. మా ఎజెండా కొనసాగుతుందని ఎవరూ మాకు గుర్తు చేయనవసరం లేదన్నారు సీఎం రేఖా గుప్తా. .