ఓటీపీ అడిగారు.. రూ.77లక్షలు దోచేశారు..!

By telugu news teamFirst Published Feb 20, 2021, 6:28 AM IST
Highlights

మీ సెల్ ఫోన్ సిమ్ కేవైసీ పూర్తి చేయలేదని.. బ్లాక్ చేస్తామంటూ చెప్పారు. అలా బ్లాక్ చేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్ డేట్ చేయాలని సూచించారు

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులకు గాలం వేసి వారికి నమ్మకం కుదిరేలా నాలుగు మాటలు చెప్పి.. తర్వాత నెమ్మదిగా వారి బ్యాంకు ఖాతాలోని నగదు మొత్తాన్ని దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కటక్ లో ఇద్దరు డాక్టర్ల బ్యాంకు ఖాతాతల నుంచి దాదాపు రూ.1.30కోట్లు దోచుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

ఓటక్ సీడీఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వైద్యులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వారిలో ఒకరు రిటైర్డ్ డాక్టర్ కాగా.. మరొకరు ఆయుర్వేద వైద్యుడు. ఈ నెల 9వ తేదీన మహంతి అనే డాక్టర్ కి ఫోన్ వచ్చింది. మీ సెల్ ఫోన్ సిమ్ కేవైసీ పూర్తి చేయలేదని.. బ్లాక్ చేస్తామంటూ చెప్పారు. అలా బ్లాక్ చేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ అప్ డేట్ చేయాలని సూచించారు. తాను బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో చేయిస్తానని ఆ డాక్టర్ చెప్పినప్పటికీ.. లేదు.. తాము వెంటనే అప్పుడే చేస్తామంటూ నమ్మించారు.

అందుకు తాము చెప్పినట్లు చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఓ యాప్ డౌన్ లోడ్ చేయించి.. ఏటీఎం కార్డు నెంబర్ కూడా లోడ్ చేయాలని సూచించారు. అలా చేయగానే ఫోన్ కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ తమకు చెప్పాలని సూచించారు. వాళ్లు అడిగినట్లు ఓటీపీ చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికీ ఆయన ఏటీఏం బ్లాక్ అయిపోయింది.  బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారంలో కొత్త కార్డు పంపించారు. అయితే.. అప్పటికే ఆయన ఖాతాలోని దాదాపు రూ.77లక్షలు ఖాళీ చేశారు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఆయన పోలీసులకుఫిర్యాదు చేశాడు.

ఇదే విధంగా మరో ఆయుర్వేద వైద్యుడిని కూడా మోసం చేశారు. ఆయన ఖాతా లో నుంచి రూ.52లక్షలు స్వాహా చేశారు. వీరి ఇరువురి కేసులను పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మొత్తంగా ఈ ఇద్దరు డాక్టర్ల నుంచి రూ.1.30 కోట్లు స్వాహా చేశారు. 
 


 


 

click me!