Goa Assembly Election 2022: కస్సుబుస్సులాడి.. మళ్లీ చెంతకు? కాంగ్రెస్, తృణమూల్ పొత్తు? నేతలతో రాహుల్ భేటీ

By Mahesh KFirst Published Jan 10, 2022, 11:48 PM IST
Highlights

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా వ్యవహరించాయి. ముఖ్యంగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేసే విషయమై ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. టీఎంసీ నిర్ణయంతో బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలిక ఏర్పడుతుందని, అది పరోక్షంగా బీజేపీని లబ్ది చేకూర్చే ముప్పు ఉన్నదని కాంగ్రెస్ వాదించింది. కానీ, టీఎంసీ వాటిని లైట్ తీసుకుంది. అయితే, తాజాగా, వచ్చే నెల 14వ తేదీన జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ మేధోమధనం చేసినట్టు తెలిసింది. గోవాకు చెందిన కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశం కాబోతున్నట్టు సమాచారం.
 


న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్(Congress), తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీలు ఉప్పు నిప్పుగా వ్యవహరించాయి. రెండూ ప్రతిపక్ష శిబిరాల్లో ఉన్నప్పటికీ కలిసి నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రవర్తించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కొందరు అంటే.. కాంగ్రెస్సేతర ప్రతిపక్ష కూటమికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ జట్టు కట్టే పనిలో పడ్డారు. ముఖ్యంగా గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తొలిసారిగా తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ చేయడానికి నిర్ణయించడం కాంగ్రెస్‌లో అసహనం పెంచింది. అది కేవలం.. బీజేపీకి మేలు చేకూరుతుందని, బీజేపీ(BJP) వ్యతిరేక ఓట్లను చీల్చడమే టీఎంసీ పనిగా ఉన్నదని ఆరోపించింది. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం, పార్టీని విస్తరించడం తమ నిర్ణయం అని టీఎంసీ సమర్థించుకుంది. నేపథ్యం ఇలా ఉండగా.. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Election) కోసం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కలిసి పోటీ(Alliance) చేసే అవకాశాలపై చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఈ చర్చ తీవ్రంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టు కట్టే సాధ్యాసాధ్యాలపై మంగళవారం రాహుల్ గాంధీ చర్చించనున్నట్టు తెలిసింది. గోవా కాంగ్రెస్ నేతలతో ఆయన ఢిల్లీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించడానికి రాహుల్ గాంధీ సోమవారం సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరంతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. ఆ తర్వాతే రాహుల్ గాంధీ బహుశా గోవా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నదని సమాచారం అందింది.

గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. కానీ, బీజేపీ ఎలాగోలా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పుడు కాంగ్రెస్ గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 17 స్థానాలను గెలుచుకుంది. తాజాగా, ప్రమోద్ సావంత్ సారథ్యంలోని గోవాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, ఆప్ కూడా ఈ సారి భారీగా సీట్లు గెలుచుకోవాలని కసరత్తులు చేస్తున్నది. చివరి సారి తీవ్ర ప్రయత్నం చేసినా.. ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ, ఓటు షేరింగ్ ఓ మేరకు లభించింది. వీటికితోడు తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ తీర రాష్ట్ర కదన రంగంలోకి అడుగు పెట్టింది. మాజీ సీఎం లుజినో ఫలెరో సహా పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరడం గమనార్హం.

అయితే, కొంత కాలంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొసగడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల కోణంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీని ఎదుర్కోవాలని ఇది వరకే ఉన్న వ్యూహం గురించి చాలా మంది సీనియర్లు వాదిస్తుండగా.. ఆ వాదనను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆమె గత నెలలో అసలు యూపీఏ ఎక్కడ ఉన్నది? అని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ దాని ఉనికినే ప్రశ్నించారు. తన మహారాష్ట్ర పర్యటనలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం తర్వాత ఆమె దేశంలో యూపీఏ లేదని అన్నారు. కాగా, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ఓడించగలదని ఆప్, టీఎంసీలపై విమర్శలు చేస్తూ గత నెల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు.

click me!