టీడీపీ‌తో చేతులు కలిపిన కాంగ్రెస్.. ఎన్నికల్లో కలిసి పోటీ.. ఎక్కడంటే..

Published : Feb 04, 2022, 09:52 AM IST
టీడీపీ‌తో చేతులు కలిపిన కాంగ్రెస్.. ఎన్నికల్లో కలిసి పోటీ.. ఎక్కడంటే..

సారాంశం

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది.  ఈ మేరకు పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడింది. గతంలో తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు మరోసారి జట్టుకట్టాయి.

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. అండమాన్ నికోబార్‌లో (Andaman and Nicobar Islands) జరిగే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు అక్కడి పార్టీ నేతలు నిర్ణయం తీసుకన్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వివరాలు.. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్‌లో జరగబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. అండమాన్ నికోబార్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్ (Rangalal Halder), టీడీపీ లోకల్ యూనిట్ అధ్యక్షుడు మాణిక్య రావ్ యాదవ్ బుధవారం అక్కడి గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఉమ్మడిగా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. 

పొత్తులో భాగంగా టీడీపీ పోర్ట్ బ్లెయిర్‌ మున్సిపాలిటీలో 25,16 వార్డుల్లో టీడీపీ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ సమావేశం అనంతరం రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. ‘అండమాన్ నికోబార్ దీవులలో అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలన కోసం.. మేము కాంగ్రెస్, టీడీపీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేసాము. మేము విజయం కోసం కృషి చేస్తాము. ఈ కూటమి పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలతో పాటుగా పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. 

ఇక, పంచాయతీ, Port Blair Municipal Council ఎన్నికలకు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు ఫిబ్రవరి 11ను చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 12 నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 14ను  చివరి తేదీగా పేర్కొన్నారు. అండమాన్ నికోబార్‌లో మార్చి 6వ తేదీన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక, గతంలో కూడా టీడీపీ Andaman and Nicobar Islands జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 2015లో జరిగిన పోర్టు బ్లెయిర్ మున్సిప‌ల్ కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో రాజకీయ ప్రత్యుర్థులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 19, టీడీపీ 2 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఏపీకి వచ్చేసరికి మాత్రం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వేరుగా బరిలో నిలిచాయి. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్