
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Assembly Elections) ప్రచారం ఊపు మీద సాగుతున్నది. బీజేపీ(BJP) తప్పు ఏ చిన్నది దొరికినా.. కాంగ్రెస్(Congress) వదిలిపెట్టడం లేదు. వీలైన అన్ని మార్గాల్లో ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే తాజాగా, కాంగ్రెస్ పార్టీ ఓ ఎలక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాట తెలుగు సినిమా ‘పుష్ప’(Pushpa)లోని ‘శ్రీవల్లి’ పాట ట్యూన్. ఈ ట్యూన్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఓ పాటను విడుదల చేసింది. యూపీ ఉన్నతిని పొగుడుతూ ఆ పాటు సాగుతుంది.
యూపీకి చెందిన వారిగా మేం గర్విస్తున్నాం అనే ట్యాగ్‌తో ఈ పాటను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడాలు, సుందర ప్రాంతాలను ఆ పాట వీడియోలో బంధించారు. అలాగే, 1857 భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం, ఆ తర్వాతి స్వాతంత్ర్య పోరాటంలోనూ ఉత్తరప్రదేశ్ నుంచి పోరాడిన కొందరు యోధుల పేర్లనూ ఆ పాట పేర్కొంది. తాము యూపీ టైప్ అంటూ ఈ పాట సాగింది. యూపీ టైప్ అని పాడిన ఈ పాట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కౌంటర్‌గానే కాంగ్రెస్ ప్రయోగించినట్టు తెలుస్తున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ అనంతరం ఆమె ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్నచూపుగా యూపీ టైప్ అనే శబ్దాన్ని ప్రయోగించారు. ఈ పద ప్రయోగం రాజీకయంగా కలకలం రేపింది. కాంగ్రెస్ నేత, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ వెంటనే నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రజలను అవమానించాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆమె నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు.. యూపీ టైప్‌గా ఉండటాన్ని గర్విస్తారని అర్థం చేసుకోండి అంటూ హితవు పలికారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జరగనున్నాయి. ఏడు విడతల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి. మార్చి 10వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. 2017లోనూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 312 స్థానాల్లో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సారి కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీల మధ్య చతుర్ముఖ పోటీగా జరగనున్నాయి. ముఖ్యంగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే గట్టి పోటీ కనిపిస్తున్నది.
ఇదిలా ఉండగా, ప్రధాని ఈ రోజు యూపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. గడచిన ఐదేళ్ళలో ఉత్తర ప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. తన ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు లబ్ధి పొందాయన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు.