రైతుల ఆందోళన: కేంద్రం చర్చలు విఫలం

By Siva KodatiFirst Published Dec 1, 2020, 8:34 PM IST
Highlights

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు మంగళవారం కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు మంగళవారం కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

దీనికి రైతు సంఘాల ప్రతినిధులు ససేమిరా అన్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టంచేశారు. కేంద్రం కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని తోసిపుచ్చారు.  

కాగా, వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు అంశాన్ని మంత్రుల బృందం రైతు ప్రతినిధుల ముందుంచగా.. వారు దాన్ని తోసిపుచ్చారు. కమిటీ ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో కొలిక్కి రాకుండానే చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది.

అయితే అప్పటి వరకు శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. చర్చల నేపథ్యంలో విజ్ఞాన్‌ భవన్‌ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.


 

click me!