తప్పడం లేదు, ఆ విద్యార్థులకు ఆగస్ట్‌ నుంచి పరీక్షలు : సీబీఎస్ఈ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Jul 21, 2021, 7:33 PM IST
Highlights

ప్రైవేటు విద్యార్థులకు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. పాఠశాలలు సాధారణంగా విద్యార్థులకు యూనిట్‌, మిడ్‌ టర్మ్‌, ప్రీ బోర్డు పరీక్షలు నిర్వహించే విషయం తెలిసిందే.
 

పరీక్షలు, ఫలితాలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. 10, 12 తరగతి ప్రైవేటు విద్యార్థుల బోర్డు పరీక్షలు ఆగస్ట్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉన్నత విద్యలో ప్రవేశాలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫలితాలను సాధ్యమైనంత తక్కువ సమయంలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. అయితే, దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గత పరీక్షల ఫలితాల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రైవేటు విద్యార్థులకు మాత్రం ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గతంలో పలువురు విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో మొదటి, రెండో ప్రయత్నంలో అర్హత సాధించలేకపోయారు. పలువురు మరింత మెరుగైన మార్కుల కోసం మరోసారి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు విద్యార్థులకు.. రెగ్యులర్‌ విద్యార్థులకు అమలు చేసినట్లుగా అసెస్‌మెంట్ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

ఇలాంటి విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్‌మెంట్‌ రికార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని బోర్డు పేర్కొంది. పాఠశాలలు సాధారణంగా విద్యార్థులకు యూనిట్‌, మిడ్‌ టర్మ్‌, ప్రీ బోర్డు పరీక్షలు నిర్వహించే విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. మార్కుల టాబులేషన్‌ విధానాన్ని అమలు చేయలేమని సీబీఎస్ఈ చెప్పింది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో సైతం చర్చించామని.. వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పింది. మరోవైపు రెగ్యులర్‌ విద్యార్థుల ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. 

click me!