చిన్నారిపై కానిస్టేబుల్ కర్కశత్వం.. కరుణ చూపిన ఉన్నతాధికారి

By telugu news teamFirst Published Nov 14, 2020, 2:29 PM IST
Highlights

తమ సిబ్బంది చేసిన తప్పును గుర్తించిన పోలీసు అధికారులు టపాసులు విక్రేత ఇంటికి వెళ్లి, ఆ ఇంటిలోని చిన్నారితో పాటు దీపావళి చేసుకున్నారు. 
 

పండగపూట ఓ చిన్నారిపై కానిస్టేబుల్ చాలా కర్కశంగా ప్రవర్తించాడు. కాగా.. అదే చిన్నారిపై పోలీసు ఉన్నతాధికారి కారుణ్యం కురిపించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

దీపావళి పండగ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ లో బాణ సంచా కొనుగోలుపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో.. బులంద్‌షహర్‌లో బాణసంచా దుకాణాలను సీజ్ చేసే సమయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై ఎస్ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. తమ సిబ్బంది చేసిన తప్పును గుర్తించిన పోలీసు అధికారులు టపాసులు విక్రేత ఇంటికి వెళ్లి, ఆ ఇంటిలోని చిన్నారితో పాటు దీపావళి చేసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే ఒక టపాసుల విక్రేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్నఅతని కుమార్తె పోలీసు వాహనానికి తన తల బాదుకుంటూ, తన తండ్రిని విడిచిపెట్టాలని పోలీసులను వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

నగరంలో అక్రమంగా బాణసంచా విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కొందరు విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనంలో కూర్చోబెట్టారు. వీరిలో ఒక దుకాణదారుని కుమార్తె తన తండ్రిని విడిచిపెట్టాలంటూ పోలీసులను వేడుకుంది. ఆ చిన్నారి అభ్యర్థనను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. పైగా ఒక కానిస్టేబుల్ ఆ చిన్నారిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు.

 దీంతో ఆ చిన్నారి మరింతగా ఏడవసాగింది. చిన్నారి మీద ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు జీపుతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ ఈ ఘటనకు కారకుడైన కానిస్టేబుల్ బ్రజ్వీర్‌పై చర్యలకు ఉపక్రమించారు. తరువాత ఎస్డీఎం, సీఓ తదితర పోలీసు అధికారులు ఆ చిన్నారి ఇంటికి వెళ్లి, అక్కడ దీపాలు వెలిగించి, స్వీట్లు పంచి, ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. 

click me!