కుటుంబాన్నే హ్యాండిల్ చేయలేరు?.. పుండు మీద కారం చల్లేలా అఖిలేష్‌పై బీజేపీ కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jan 19, 2022, 4:48 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై (Akhilesh Yadav) బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అఖిలేష్ బంధువు అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంతో ఈ దాడిని మరింతగా పెంచింది. అఖిలేష్‌పై కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) చేసిన ఈ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లిన మాదిరిగా ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అఖిలేష్ బంధువు అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంతో ఈ దాడిని మరింతగా పెంచింది. యూపీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ..  అఖిలేష్ ముఖ్యమంత్రిగా, ఎంపీగా, సొంత కుటుంబంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలోని అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టానని చెప్పుకోవడానికి ఇష్టపడే అఖిలేష్‌కు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు. ‘Akhilesh Yadav.. అతని ప్రభుత్వం అనేక పనులు చేసిందని చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి అయిన పోటీ చేసే ధైర్యం అతనికి లేదు. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 

ఇక, Samajwadi Party వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు Aparna Yadav బీజేపీ చేరడాన్ని ప్రస్తావిస్తూ అఖిలేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. అఖిలేష్ కుటుంబంలో కూడా విజయం సాధించలేకపోయారని విమర్శలు గుప్పించారు. యూపీకి ముఖ్యమంత్రిగా, లోక్‌సభ ఎంపీగా కూడా అతను విఫలమయ్యారనిఆరోపించారు. 

‘అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడుతున్నాడు. అతను సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి చాలా సమయం తీసుకున్నాడు. మేము చేసిన అభివృద్ధిపై పోరాడటానికి భయపడుతున్నాడు. అఖిలేష్ జీ.. 2012 నుంచి 2017 వరకు ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగిందో ముందు చెప్పండి. మీరు బీజేపీ అభివృద్ధి పనులతో పోటీ పడలేరు’ అని సోషల్ మీడియాలో కేశవ్ ప్రసాద్ మౌర్య పోస్టు చేశారు. 

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్దం చేసుకన్నట్టుగా సమాచారం. గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్.. శాసన మండలి సభ్యునిగా కొనసాగారు. అయితే ఇప్పుడు మాత్రం అఖిలేష్.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనే నిర్ణయం తీసుకన్నారని.. అయితే ఏ స్థానం నుంచి పోటీ చేసేది ఇంకా ఖరారు  కాలేదని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక, బీజేపీ నుంచి వలసలతో జోష్ మీదున్న సమాజ్ వాదీ పార్టీకి.. తాజాగా అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంతో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం బీజేపీ కండువా కప్పుకున్న అపర్ణ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ నుండి స్పూర్తి పొందుతానని తెలిపారు. బీజేపీ చేపడుతున్న పథకాలు తనను ఎప్పుడూ కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన సమయంలో ఆమె వెంటే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య కూడా ఉన్నారు.

అపర్ణ యాదవ్ బీజేపీ‌లో చేరడంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఆమె తమ సిద్ధాంతాలను బీజేపీకి తీసుకెళ్తారని ఆయన ఆకాంక్షించారు. అపర్ణను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తాము టిక్కెట్లు ఇవ్వలేని వారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలంటూ అఖిలేశ్ సెటైర్లు వేశారు. 

click me!