#Verdict with Asinetnews: నితీష్ కుమార్ కు భారీ ఎదురుదెబ్బ

By telugu teamFirst Published Nov 10, 2020, 8:51 AM IST
Highlights

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జేడీయు మూడో స్థానానికి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి రెండో స్థానం పొందవచ్చు. మహాఘట్ బంధన్ విజయం దిశగా సాగిపోతోంది.

న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ ఎన్నికల్లో జెడీయు నాయకుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ఆర్జెడీ మూడో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ధోరణి ఆ విషయాన్ని తెలియజేస్తోంది. బిజెపి రెండో స్థానానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాఘట్ బంధన్ తిరుగులేని విజయం దిశగా పయనిస్తోంది. మహాఘట్ బంధన్ లో ఆర్జెడీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది.

మూడు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికలు ముగిసాయి. 243 అసెంబ్లీ సీట్లకు గాను జరిగిన పోలింగ్ తాలూకు కౌంటింగ్ ఆరంభమయింది. ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీయే కూటమి విజయభేరి మోగిస్తాయని చెప్పగా.... నాలుగు వారల గ్యాప్ తరువాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందుకు భిన్నంగా మహాఘట్ బంధన్ కి స్వల్ప ఆధిక్యతను అందిస్తూ విజయావకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. నిన్ననే 31వ జన్మదినం జరుపుకున్న తేజశ్వి లాలూ వారసత్వాన్ని కొనసాగిస్తాడా... లేదా మరోమారు నితీష్ కుమార్ బీహార్ సీఎం అవుతారా అనేది తేలనుంది. 

నేటి ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమయింది. కౌంటింగ్ కి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల కమిషన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత కోసం భారీ స్థాయిలో బలగాలను మోహరించింది. 
ఓట్ల లెక్కింపు కోసం బీహార్ వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు.  తూర్పు చంపారన్‌, గయ, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో మూడేసి చొప్పున కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతను  ఏర్పాట్లు చేశారు.

మొదటి అంచెలో సీఐఎస్ఎఫ్, రెండవ అంచెలో బీహార్ మిలటరీ పోలీసులు, మూడవ అంచెలో జిల్లా పోలీసులను మోహరించింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సైతం ఇదే భద్రతను ఉంచారు. సిఐఎస్ఎఫ్  సిబ్బంది నిరంతర కాపలాతో పాటు వీడియో కెమెరాలతో నిత్యం డేగకన్నుతో పహారా కాస్తున్నారు. 

మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాల్లో 1,06,524 ఈవీఎంలను లెక్కించనున్నారు. 370 మంది మహిళా అభ్యర్థులతో సహా 3,588 మంది మంది అభ్యర్థుల భవితవ్యాలు ఇప్పటికే వాటిలో నిక్షిప్తమయ్యాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకూ  పూర్తిగా వీడియో రికార్డింగ్ ను చేయనున్నారు. 
ఇక ఈ ఎన్నికల్లో 57.05 పోలింగ్ శాతం నమోదైంది. కరోనా మహమ్మారి  ప్రబలంగా వ్యాపిస్తున్నప్పటికీ.... 2015తో పోల్చుకుంటే పోలింగ్ శాతం ఒకింత ఎక్కువగా నమోదవడం ఆశ్చర్యకరం.

click me!