
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో బేటీ కానున్నారు. ఈ తరుణంలో ఇరువురు నేతల మధ్య పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అయితే.. భారత్ రాకముందు.. షేక్ హసీనా వార్తా సంస్థ ANI కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భారత్‌ను మిత్రదేశంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు.
బంగ్లాదేశ్ కు భారత్ నమ్మకమైన భాగస్వామి అని ప్రధాని షేక్ హసీనా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం గురించి నొక్కి చెప్పారు. 1971 యుద్ధంలో భారతదేశం అందించిన సహకారాన్ని తాము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని అన్నారు. అలాగే.. 1975లో నేను నా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినప్పుడు.. అప్పటి భారత ప్రధాని తనకు భారతదేశంలో ఆశ్రయం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు పొరుగు దేశాలని, మన పొరుగు దేశాలతో స్నేహానికి తాను ఎల్లప్పుడూ విలువ ఇస్తానని అన్నారు. ఎందుకంటే ఈ స్నేహం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతోందని తెలిపారు.
ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో.. బంగ్లాదేశ్ విద్యార్థులు చాలా మంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. భారతదేశం తన విద్యార్థులను అక్కడి నుండి బయటకు తీసుకువెళ్లినప్పుడు.. తమ దేశం విద్యార్థులను కూడా అక్కడి నుండి బయటకు సురక్షితంగా తీసుకవచ్చారు. ఈ విషయంలో ప్రధాని మోడీకి ధన్యవాదాలు. అలాగే.. వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ చొరవ మారువలేనిదనీ, భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌కే కాకుండా ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా భారత్ అందించిందని ప్రశంసించారు.
సమస్యలు ఉన్నాయి, కూర్చుని పరిష్కరిస్తాం
భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న సమస్యలపై హసీనా మాట్లాడుతూ.. కొన్ని సమస్యలున్నాయని, అయితే వాటిలో చాలా వరకు పరిష్కరించాం. ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని కూడా కూర్చోని పరిష్కరిస్తామన్నారు. భారతదేశం నుండి ప్రతి విషయంలో సహాయం అందుతోంది. కాబట్టి భారతదేశం మరింత ఉదారత చూపాలి. దీని వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. కొన్నిసార్లు తీస్తా నది వల్ల మన ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయంలో ఇరుదేశాలు చర్చించి.. పరిష్కరించుకోవాలన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా తహతహలాడుతున్నారని అన్నారు.
అలాగే.. భారత విదేశాంగ విధానం చాలా స్పష్టంగా ఉందనీ, అందరితో స్నేహం ఉండాలని, ఎవరితోనూ అసూయపడకండని అన్నారు. చైనా, భారత్‌ల మధ్య ఏదైనా సమస్య ఉంటే.. అందులో మనం జోక్యం చేసుకోకూడదని సూచించారు. ఇరుదేశాలు అభివృద్ధి చెందాలి. పొరుగు దేశాల మధ్య సమస్య ఉంటే ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
మన పరిస్థితి శ్రీలంకలా ఉండదు
బంగ్లా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ చాలా బలంగా ఉందని షేక్ హసీనా అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నామనీ, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా దాని ప్రభావాన్ని కలిగి ఉంది, కానీ బంగ్లాదేశ్ సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తోందనీ, శ్రీలంక లాంటి పరిస్థితిని భారత్ ఎప్పటికీ ఎదుర్కొందని అన్నారు.
అలాగే.. భారతదేశం చాలా పెద్ద దేశమని.. ఎంతోమంది రోహింగ్యా శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇచ్చిందని అన్నారు. అయినా భారత్ పెద్దగా ఏమీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. లక్షల మంది రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి సమస్యాత్మకంగా మారారని.. శరణార్థులు 11 లక్షల మంది రోహింగ్యా శరణార్థులు ఉండటంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.