కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ సోదాలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్‌కు మద్దతుగా మాట్లాడారు. 100 కంటే ఎక్కువ దాడులే చేశారని.. అక్రమంగా సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా కనుగొనలేదని అన్నారు. ఇవి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యర్థులను నిలువరించేందుకు చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలు అని ఆరోపించారు.
‘‘గత ఏడాదిగా మనం చూస్తున్నాం... మద్యం కుంభకోణం గురించి ఆరోపణలు చేస్తున్నారు. 1000 కంటే ఎక్కువ దాడులు నిర్వహించబడ్డాయి. ఒక్క పైసా కూడా రికవరీ కాలేదు. వారు కేవలం 'స్కామ్' అని ఆరోపిస్తూనే ఉన్నారు. సంజయ్ సింగ్ నివాసంలో జరిగిన సోదాల్లో కూడా ఏమీ కనుగొనబడలేదు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘‘నిన్న జర్నలిస్టులపై దాడి చేశారు, ఈరోజు సంజయ్ సింగ్, రేపు మీపై దాడి చేయవచ్చు. 2024లో ఓటమి ఖాయమైన పార్టీ చేస్తున్న తీరని ప్రయత్నాలు ఇవి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఇక, 2021 లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీ-లాండరింగ్ ఆరోపణలపై బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో మధ్యవర్తి దినేష్ అరోరా వాంగ్మూలం ఆధారంగా ఇడి ఛార్జిషీట్‌లో సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించింది. ఈడీ ప్రకారం.. తన రెస్టారెంట్ అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్‌లో పార్టీ సందర్భంగా సంజయ్ సింగ్‌ను కలిశానని అరోరా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు సమకూర్చాలని రెస్టారెంట్ యజమానులను సంజయ్ సింగ్ కోరారు. 2020లో సంజయ్ సింగ్‌కు ఫండ్‌కు రూ. 82 లక్షల చెక్కును అందించినట్లు అరోరా పేర్కొన్నారు. ఇక, ఇదే కేసులో కేజ్రీవాల్‌ను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.