ఒడిశాలో టూరిస్ట్ బస్సు బోల్తా... ఆరుగురు దుర్మరణం, 30మందికి తీవ్ర గాయాలు

By Arun Kumar PFirst Published May 25, 2022, 9:38 AM IST
Highlights

ఘాట్ రోడ్డుపై వెళుతూ టూరిస్ట్ బస్సు అదుపుతప్పడంతో ఆరుగురు దుర్మరణం చెందగా, 30మంది తీవ్రంగా గాయపడిన ఘటన ఒఢిశాలో చోటుచేసుకుంది. 

భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంజామ్​-కంధమల్​ సరిహద్దుల్లో ప్రయాణికులతో వెళుతున్న టూరిస్ట్ బస్సు అదపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... ఒడిశాలోకి  దారింగ్​బడి నుంచి బంగాల్​కు మంగళవారం రాత్రి చాలామంది ప్రయాణికులతో ఓ టూరిస్ట్ బస్సు బయలుదేరింది. అర్ధరాత్రికి బస్సు కంధమల్ జిల్లాలోని కళింగ ఘటి ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘాట్ రోడ్ పై బస్సు అదుపుతప్పడంతో లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు వున్నారు. 

బస్ ప్రమాదాన్ని గుర్తించినవారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని  బెర్హమ్​పుర్​ ఎంకేసీజీ ఆసుపత్రికి, మరికొందరిని భంజానగర్​ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.  

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడని... ఘాట్ రోడ్డుపై బ్రేకుల్లేకుండా డ్రైవింగ్ అసాధ్యం కాబట్టి బస్సు బోల్తాపడినట్లు ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం ఈ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గల కారణాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు. 

ఇదిలావుంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు కాశీయాత్రకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. నిజామాబాద్ నుంచి కాశీకు వెళ్లిన బస్సు బిహార్ లోని జౌరంగాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. భక్తులతో వెళుతున్న బస్సును వెనకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. 

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి గాయపడిన వారిని దగ్గర్లోని ఔరంగాబాద్ హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాన్ని కూడా హాస్పిటల్ కు తరలించారు.  

నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ తో పాటు నిర్మల్ జిల్లా బాసర కు చెందిన దాదాపు 38మంది భక్తులు ఓ బస్సులో ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి బయలుదేరారు. బిహార్ లో ఈ బస్సు ప్రమాదానికి గురవగా వెల్మల్ గ్రామానికి చెందిన సరలమ్మ మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఔరంగాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

  

 

 

click me!