
చండీగఢ్ : కేంద్రపాలిత ప్రాంతమైన Chandigarhలో విద్యుత్ విభాగం సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో చండీఘడ్ లోని చాలా ప్రాంతాల్లో గత 36 గంటలుగా Power supply నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. power cut అవ్వడంతో నీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ లైట్లు వెలగడం లేదు. ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చండీగఢ్లో ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ విద్యుత్ విభాగ విభాగ సిబ్బంది మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెను వెనక్కి తీసుకోవాలని అధికారులు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సిబ్బంది సమ్మె చేపట్టారు. విధులకు హాజరు కావట్లేదు. ఫలితంగా అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సమస్య తలెత్తింది.
36 గంటలు గడిచినా ఇంకా కరెంటు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పవర్ కట్ తో ఆన్లైన్ క్లాసులు నిలిచిపోయాయి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మూతపడ్డాయి. ఆసుపత్రులను జనరేటర్లతో నడిపిస్తున్నప్పటికీ.. కొన్ని శస్త్ర చికిత్సను వాయిదా వేస్తున్నారు.
ఫోన్ చార్జింగ్ ల కోసం పొరుగు నగరాలకు..
నిరంతరాయంగా కరెంటు లేకపోవడంతో ఫోన్లలో చార్జింగ్ కూడా లేని పరిస్థితి. దీంతో చాలా మంది ప్రజలు ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు పొరుగు నగరాల్లో ఉండే తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న మొహాలీ, జిరాక్ పుర్ , పంచకుల ప్రాంతాల్లో చండీగఢ్ వాసుల తాకిడి పెరిగింది అని అధికారులు చెబుతున్నారు.
ఎస్మా ప్రయోగం..
పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చండీగఢ్ ప్రభుత్వం విద్యుత్ విభాగ సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరునెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ ఇంకా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో బుధవారంనాటికి కరెంటు కోత కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సమస్యే తలెత్తింది. విద్యుత్ సరఫరాపై దురుద్దేశ పూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక లపై పరువునష్టం కేసు వేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి Nagulapalli Srikanth మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. Secretary, Department of Powerగా పలుమార్లు విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో Power cuts లేవని తెలియజేస్తున్నప్పటికీ ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వార్తలు ప్రచురిస్తున్నారు అని తెలిపారు.
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. అయినా కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొంత కాలంలో ఏపీలో విద్యుత్ కోతల మీద అనేక కథనాలు ప్రచారం అవుతున్నాయి.