Agnipath: భారత నేవీలో ఉద్యోగం కోసం ‘అగ్నిపథ్’ కింద 3 లక్షల దరఖాస్తులు

Published : Jul 24, 2022, 01:44 AM IST
Agnipath: భారత నేవీలో ఉద్యోగం కోసం ‘అగ్నిపథ్’ కింద 3 లక్షల దరఖాస్తులు

సారాంశం

అగ్నిపథ్ స్కీం కింద భారత నావికా దళానికి శుక్రవారం నాటికి 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 2వ తేదీనే ఇండియన్ నేవీ ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

న్యూఢిల్లీ: భారత నావికా దళంలో ఉద్యోగం కోసం అగ్నిపథ్ స్కీం కింద 3.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం నాటికి ఈ మేరకు దరఖాస్తులు వచ్చినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శనివారం ట్వీట్ చేశారు. అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్‌‌మెంట్ ప్రక్రియను ఇండియన్ నేవీ జులై 2వ తేదీనే ప్రారంభించింది.

ఇండియన్ నేవీలో అగ్నివీరుల కోసం ఇప్పటి వరకు 3,03,328 దరఖాస్తులు వచ్చినట్టు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. జులై 22 నాటికి ఈ మొత్తం దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. 

అగ్నిపథ్ స్కీం జూన్ 14న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీంతో ఆర్మీలో షార్ట్ సర్వీస్‌కు కేంద్రం తెరలేపింది. పదిహేడున్నర ఏళ్లు, 21 ఏళ్ల వయసు మధ్య యువత అగ్నిపథ్ స్కీం కింద భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరు నాలుగేళ్లపాటు ఆర్మీలో సేవలు అందించి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఇందులో నుంచి కొందరు ఆర్మీలో లాంగ్ టర్మ్ సేవలు అందించడానికి ఎంపిక అవుతారు.

ఈ పథకం తర్వాత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. షార్ట్ సర్వీసును వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు కూడా చెలరేగాయి. తాము ఆర్మీ కోసం ప్రిపేర్ కావడానికే మూడేళ్లు పడుతున్నదని, నాలుగేళ్లు సేవలు అందించి ఆ తర్వాత మళ్లీ నిరుద్యోగులుగా మారమంటారా? అంటూ అభ్యర్థులు ఆందోళనలు వెలిబుచ్చారు. అలాగే, కరోనా సమయంలో ఆర్మీ కోసం మొదలైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మధ్యలోనే అటకాయించారు. ఈ నోటిఫికేసన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా తమ భవిత ప్రశ్నార్థకంలో పడిందని ఆరోపించారు. 

దీంతో అగ్నివీర్ అప్పర్ ఏజ్ లిమిట్‌ను 21ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచింది. 2022 ఏడాదికి మాత్రమే ఇది వర్తించనుంది. అలాగే, ఆ తర్వాత నిరుద్యోగులు అనే విమర్శలకు సమాధానంగా  కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. ఇతర కేంద్ర విభాగాల్లో ఉద్యోగాల కోసం అగ్నివీరులకు రిజర్వేషన్లు ఇస్తామని, ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu
TCS Nashik Case Twist: TCSలో అమ్మాయిలే టార్గెట్..కోపరేట్ చేస్తున్న HR | Asianet News Telugu