`ప్రేమకథా` మూవీ రివ్యూ.. నయా లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

By Aithagoni RajuFirst Published Jan 5, 2024, 11:12 PM IST
Highlights

పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ వారం చిన్న చిత్రాలకు టైమ్ కలిసి వచ్చింది. అందులో భాగంగా `ప్రేమకథ` అనే మూవీ విడుదలైంది. ఇది ఆడియెన్స్ ని అలరించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

పెద్ద సినిమాలు లేకపోతే చిన్న చిత్రాల జోరు సాగుతుంది. వరుసగా ఐదారు సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు సందడి చేశాయి. అలా వచ్చిన సినిమాల్లో `ప్రేమకథ` ఒకటి. సరికొత్త ప్రేమ కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కిషోర్‌ శాంతి దినకరణ్‌, దియా సీతేపల్లి, వినయ్‌ మహాదేవ్‌, నేత్ర ప్రధాన పాత్రలు పోషించారు. శివ శక్తి రెడ్‌ డీ దర్శకత్వం వహించారు. విజయ్‌ మిట్టపల్లి నిర్మాత. చాలా వరకు చిన్న సినిమాలంటే మంచి కంటెంట్‌ తో వస్తుంటాయి. కొత్త కాన్సెప్ట్ లను పరిచయం చేస్తుంటారు. కానీ ఇటీవల రివర్స్ అయిపోయింది. చిన్న సినిమాల్లో అసలు మ్యాటరే ఉండటం లేదు. మరి తాజాగా వచ్చిన `ప్రేమకథ` ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
పేద ధనిక ప్రేమ కథ ఇది. ఇందులో ప్రేమ్‌(కిషోర్‌ శాంతి దినకరణ్‌) పేదింటి కుర్రాడి. ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. తన సంపాదనతోనే కుటుంబం గడవాల్సిన పరిస్థితి ఉంటుంది. తన ఫ్రెండ్‌ లవ్‌ లో ఉంటాడు. ఫ్రెండ్‌ శంకర్‌కి సహాయం చేద్దామని అతనితో వెళ్తాడు. తన ఫ్రెండ్‌ వాళ్ల లవర్‌ కూడా ఫ్రెండ్‌(దియా సీతేపల్లి)ని తెచ్చుకుంటుంది. ఓ వైపు ఈ ఇద్దరు ప్రేమ పాఠాలు చెప్పుకుంటారు. వారికోసం ఇచ్చిన ఈ ఇద్దరు స్నేహితుల మధ్య క్రమంగా పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. వీరి ఫ్రెండ్స్ లవ్‌ ట్రాక్‌ పక్కకెళ్లి, వీళ్ల ప్రేమ మెయిన్‌స్ట్రీమ్‌లోకి వస్తుంది. అయితే మధ్యలో ప్రేమ్‌కి లవర్‌ దియా హ్యాండిస్తుంది. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడుతుంది. దీంతో కుమిలిపోయిన ప్రేమ తనప్రేమ కోసం ఏం చేశాడు? ప్రేమని తక్కించుకున్నాడా? త్యాగం చేశాడా? ఈ సరికొత్త లవ్‌ ట్రాక్‌ ఏ మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః
ఫ్యూర్‌ లవ్‌ స్టోరీ చిత్రాలు వచ్చి చాలా కాలం అవుతుంది. `లవ్‌ స్టోరీ`, `సీతారామం` వంటి చిత్రాలు ఇటీవల మెప్పించాయి. కానీ చాలా అరుదుగా వస్తున్నాయి. వచ్చిన వాటిలో ఆడియెన్స్ ని కనెక్ట్ అయ్యే చిత్రాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. పైగా ఇప్పుడు అంతా బోల్డ్ లవ్‌ స్టోరీస్‌, చాలా ఫాస్ట్ ప్రేమలు వస్తున్నాయి. కలవగానే ఫ్లడ్‌ చేయడం, కుదిరితే ఓ లెక్క,కుదరకపోతే మరో లెక్క అన్నట్టుగా ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథలు రావడం, అవి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండటం చాలా అరుదు. `ప్రేమకథ` చిత్రంతో కొంత వరకు ప్రయత్నం చేశాడు. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా, వారి హృదయాలను హత్తుకునేలా చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. 

సినిమా ఫస్టాఫ్‌లో హీరో ఫ్రెండ్‌ లవ్‌కి సపోర్ట్ చేయడం, ఈ క్రమంలో ఫ్రెండ్‌ లవరి ఫ్రెండ్‌ తనకు పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమగా మారడం ఆ ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్లడం అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొత్త ఫీల్‌ని కలిగిస్తుంది. అయితే ఈ ప్రేమ వెనుక ధనిక, పేద వ్యత్యాసాలు సైతం హృదయాన్నికదిలిస్తుంటాయి. ఓ వైపు ప్రేమ కథని, మరోవైపు తారతమ్యాలను చూపించిన విధానం బాగుంది. ఓ ప్రేమ కథలోనూ అంతర్లీనంగా కొన్ని సామాజిక అంశాలను చర్చించడం అభినందనీయం. మొదటి భాగం మొత్తం లవ్‌ ట్రాక్‌లోనే సాగుతుంది. రెండో భాగం కాస్త ఎమోషనల్‌ సైడ్‌, ఫ్యామిలీ డ్రామా కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడు. క్లైమాక్స్ ని బలంగా రాసుకున్నారు. అక్కడ ఓ వైపు ప్రేమకి సంబంధించిన ఎమోషనల్‌ సీన్లని, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి రూపొందించారు. సినిమాని పీక్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎమోషనల్‌ సీన్లు బాగా పండాయి. హృదయాలను బరువెక్కించేలా ఉంటాయి.

అయితే సినిమా చాలా వరకు స్లోగా సాగుతుంది. ల్యాగ్ లు బాగా ఉన్నాయి. లవ్‌ స్టోరీని చాలా స్లో నెరేషన్‌లో చెప్పాడు. చాలా లాజిక్స్ ని వదిలేశాడు. మరోవైపు డ్రామా ఓవర్‌ అయ్యింది. సన్నివేశాల్లో సహజత్వం మిస్‌ అయ్యింది. ఆ ఫీస్‌ మిస్‌ అయినట్టు అనిపిస్తుంది. చిన్న పాయింట్‌ని రెండు గంటల సేపు నడిపించడం ఇందులో పెద్ద సవాల్‌ అని చెప్పాలి. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ని సినిమాగా తీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషన్‌ సినిమాకి బలం. ఫన్‌ సీన్లు బాగా రాసుకుంటే బాగుండేది. ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా దీన్ని తీర్చిదిద్దాల్సింది. స్లో నెరేషన్‌ తగ్గించి ఫీల్ గుడ్‌ లవ్ స్టోరీగా తెరకెక్కించే ఉంటే మంచి సినిమా అయ్యేది. ఓవరాల్‌గా జస్ట్ ఓకే.

నటీనటులు, టెక్నీషియన్లు..

ప్రేమ పాత్రలో కిషోర్‌ శాంతి దినకరణ్‌ నటన బాగుంది. స్ట్రగుల్‌ అయ్యే సీన్లు, లవ్‌ సీన్లు, ఎమోషనల్‌ సీన్లు బాగా చేశాడు. హీరోయిన్‌ దియా అలరించింది. ఆకట్టుకుంది. ఫ్రెండ్‌ పాత్రలు చేసిన రాజ్‌ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు ఆకట్టుకున్నారు. సినిమా ప్రధానంగా ఈ ఐదు పాత్రలచుట్టూతే సాగుతుంది. దీంతో పెద్దగా ఇతర పాత్రలు హైలైట్‌ కావు. మరోవైపు టెక్నీకల్‌గా దర్శకుడు శివ శక్తిరెడ్‌ డీ దర్శకత్వం ఫర్వాలేదు. కానీ ఇంకా వర్క్ చేయాల్సింది. మరింత గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాల్సింది. ఫన్‌, లవ్‌ సీన్లపై ఫోకస్‌ పెడితే ఫలితం ఇంకా బాగుండేది. వాసు పెండేం కెమెరా వర్క్ బాగుంది. రథన్‌ మ్యూజిక్‌ జస్ట్ ఓకే. ఇంకా బాగా చేయోచ్చు. నిర్మాణ విలువలు సినిమా పరిధి మేరకు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఇదొక టైమ్‌ పాస్‌ మూవీ అని చెప్పొచ్చు.

రేటింగ్‌ః 2.5

నటీనటులు - కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు

టెక్నికల్ టీమ్
డీవోపీ - వాసు పెండెం
మ్యూజిక్ - రధన్
ఎడిటర్ - ఆలయం అనిల్
ఆర్ట్ డైరెక్టర్ - వీర మురళి
కాస్ట్యూమ్స్ - శివాని ఎర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -  గిరి పిన్నింటి
లైన్ ప్రొడ్యూసర్స్ - ఈ. శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్ రెడ్డి, చందు కొదురుపాక
లిరిక్స్ - కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్
బ్యానర్స్ - టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్
నిర్మాతలు - విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్
కో ప్రొడ్యూసర్ - ఉపేందర్ గౌడ్ ఎర్ర
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం - శివశక్తి రెడ్ డీ
 

click me!