#MrKing: `మిస్టర్ కింగ్` రివ్యూ

By Surya Prakash  |  First Published Feb 24, 2023, 11:50 AM IST

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయిన చిత్రం ఇదే.  సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కింది.



స్టార్ హీరోల సినిమాలు ఎలూగూ ఒకే మూసలో కమర్షియల్ పంధాలో కొట్టుకుపోతూంటాయి. వాటికి అలవాటు పడిపోయాం . అయితే అప్పుడప్పుడూ కొత్త దర్శకులు, కొత్త హీరోలు వచ్చినప్పడల్లా కొత్త కథలు వస్తాయని ఆశపుడుతూంటుంది.అలాగే కొత్త కాన్సెప్టులు, రొటీన్ ని దాటే కథనాలు తెరకెక్కాలని ప్రయత్నించిన ప్రతీసారి మన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే కొత్తదనం పేరుతో నేల విడిచి సాము చేయకూడదనేదే వారు కోరుకునేది.  తాజాగా ఓ కొత్త దర్శకుడు శశిధర్ ..ఓ కొత్త హీరోతో మిస్టర్ కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కించాడు. ట్రైలర్స్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మరి ఈ కొత్తదనం సినిమాలోనూ ఉందా..అసలు ఈ చిత్రం కథేంటి., మిస్టర్ కింగ్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

Latest Videos

undefined

 ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్ శివ (శరణ్) ఆర్జేగా పనిచేస్తూంటాడు.  అతనిది  నిక్కచ్చైన వ్యక్తిత్వం.  దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుములా ఉంటాడు. అతని నిస్సందిగ్ధత చుట్టు ప్రక్కల వాళ్లని ఆలోచనలో పడేస్తూ కొన్నిసార్లు ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. ఎవరికి తలవంచని,అబద్దం చెప్పటానికి కూడా ఇష్టపడని అతనికి జీవితంలో అడుగడుగునా ఏదో ఒక సమస్య ఎదురౌతూనే ఉంటుంది. అలాంటి వాడిని ప్రపంచం ఏ మేరకు ఏక్సెప్టు చేస్తుంది.?

ఇంధనం లేకుండా ప్లైట్ ని గాలిలో ఎగిరే టెక్నాలజి  ‘ప్రాజెక్ట్ వాయు’ అతని డ్రీమ్ ప్రాజెక్టు. దాని ఎప్రూవల్ కు సమస్యలు ఎదురౌతూంటాయి. ఇక అతని లవ్ స్టోరీ విషయానికి వస్తే...అతని ఇంటి ప్రక్కనే ఉండే  సీతారామరాజు (మురళీ శర్మ) కూతురు ఉమాదేవి (యశ్విక నిష్కల)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఇది సీతారామరాజుకు ఇష్టం ఉండదు. తన కూతురుని పెద్దగా ఆదాయం లేని ఓ ఆర్జేకు ఇవ్వటానికి ఇష్టపడడు. ఆ విషయం డైరక్ట్ గా చెప్పకుండా అతన్ని తన కూతురుతో పెళ్లి కాకుండా తెలివిగా తప్పించే ప్రయత్నం చేస్తూంటాడు. ఈ విషయం  అర్దం చేసుకున్న శివ ఏం చేసాడు...ఎలా తన వ్యక్తిత్వంతోనే తన ప్రేమను గెలుచుకున్నాడు... ‘ప్రాజెక్ట్ వాయు’ ని ఎలా పట్టాలు ఎక్కించగలిగాడు, ఈ సినిమాలో వెన్నెల (ఊర్వీ సింగ్) పాత్ర ఏమిటి..క్యాబ్ డ్రైవర్ (సునీల్) కు ఈ కథలో సంభందం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ:

ఇది మల్టిఫుల్ లేయర్స్ ఉన్న కథ.  ప్యూర్ క్యైరక్టరైజేషన్ డ్రామా. ఆలోచనలో లోతెక్కువ. గాఢత సున్నితత్వం హెచ్చు. మెలికలు తక్కువ.  హీరో తన లక్ష్యం అయిన ‘ప్రాజెక్ట్ వాయు’ని సక్సెస్ చేసుకోవటం...అలాగే తన ప్రేమను గెలుచుకోవటం అనేది కీలకాంశం. అయితే అందుకు హీరో పనిగట్టుకుని  ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోవటమే ఈ కథ ప్రత్యేకత.తన వ్యక్తిత్వం స్ట్రాంగ్ గా ఉంటే సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి అన్న ధోరణిలో నడుస్తూంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని అర్దం చేసుకుని అందరూ సహకించి మారటమే కథ సారాంశంగా కనపడుతుంది. అయితే రెగ్యులర్ గా మన హీరో ..అతని సమస్యలు సెటప్ చేయటం...వాటిని తన భుజ బలంతోనే లేక తన మేధో బలంతోనే ఎదుర్కోవటం అనేది స్ట్రైయిట్ గా చూపెడుతూంటారు. అది ఇక్కడ కనపడకపోవటంతో వాటికి అలవాటుపడిన మనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది సాధారణంగా నవలలో ఉండేటటువంటి నేరేషన్. దాన్ని అదే విధంగా...ఆ యాంగిల్ లోనే  ప్రెజెంట్ చేయటమే సమస్య, ప్లస్ రెండూను. దాంతో చూస్తున్నప్పుడు కాస్తంత కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది కొన్ని చోట్ల. 

హీరో ఏమి చేయడేమిటి..ఎంతసేపు డైలాగులు చెప్తూ ..ఏదో జరుగుతుందని వెయిట్ చేస్తున్నట్లుగా ఉంటాడేమిటి అనిపిస్తుంది. కాని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కు వచ్చేసరికి అతను స్ట్రాంగ్ క్యారక్టర్ కి అందరూ కన్వీన్స్ అయ్యారని తెలిసినప్పుడు బావుందనిపిస్తుంది. కాలక్షేపం సినిమాగా కాక ఇంకొంచం అలోచింపచేసే దశగా ఉన్న సినిమా ఇది.  ఇంగిలీషు లొ The Fountainheadలో  "Howard Roark "క్యారక్టర్ ని గుర్తు చేస్తూంటుంది.  మనిషి అంటే ఏమిటో చూపించడానికి ఆ పుస్తకం రాసింది అయిన్‌ రాండ్‌. మనిషి ‘అయినవాడు’ ఏం కోరుకుంటాడో, ఏ రకంగా ఆ కోరికను తీర్చుకుంటాడో రాయడానికి చెప్పాలనుకుంది. ‘మనిషి చైతన్యం సాధించే గెలుపుకి ఒక ఇతిహాసంగా, మనిషిలోని ‘నేను’కు ఒక ‘హిమ్‌’గా  ఈ నవలను తీర్చిదిద్దారు ఆమె. దాదాపు అలాంటి ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేసాడీ దర్శకుడు.   ఇంటర్వెల్ బాంగ్ ని థ్రిల్లింగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ పై చాలా అంచనాలు పెరుగుతాయి. సాధారణంగా ఇలాంటి కథల్లో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో బలంగా పెట్టుకుంటారు. ఇందులో కూడా ఒక ట్విస్ట్ వుంది కానీ .. అది మరీ లాగకుండా ముగించేసాడు.  
 
టెక్నకల్ గా..

తొలిచిత్రానికి విభిన్నమైన కథాంశం ఎంచుకున్నాడు దర్శకుడు శశిధర్. ఎక్కడా కొత్త దర్శకులుగా కాకుండా నీట్ గా తాను అనుకున్నది ప్రెజెంట్ చేసుకుంటూ పోయారు. మురళిశర్మ, సునీల్ వంటి సీనియర్స్ ని బాగా ప్రెజెంట్ చేసారు. కొత్త హీరో, హీరోయిన్స్ నుంచి కావాల్సిన మేరకు నటన రాబట్టారు. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే ఇంకాస్త బాగుండేది అనిపిస్తుంది. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే బాగుంది. రెండు పాటులు బాగున్నాయి. ముఖ్యంగా సునీల్ మీద తీసిన పాట సినిమాకు హైలెట్.   కెమరాపనితనం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కొన్ని అలరించే సింగిల్ లైనర్స్ రాశారు.  చాలావరకూ యూత్  ని ఎంగేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు దర్శకుడు.  ఎడిటింగ్ ఎక్కడా జర్క్ లు లేకుండా సాగింది. ఎడిటర్, డైరక్టర్ ఒకరే కావటంతో క్లారిటీతో సాగింది. 
 
నటీనటుల్లో ...హీరో  శరణ్ కుమార్ కొత్త వాడైనా తెరపై చాలా సహజంగా కనపడ్డాడు. అయితే కొన్ని సీన్స్ లో ఎక్సప్రెషన్స్ ఇంకా బాగా ఇవ్వల్సింది అనిపిస్తుంది.  డైలాగు డెలవరీ బావుంది.  హీరోయిన్స్ లో ఊర్వీ సింగ్  అందంగా వుంది. మురళిశర్మ కీలకమైన పాత్ర. ఆ పాత్రలో ఆయన వుండటం వలన సీరియస్ నెస్ వచ్చింది.  ఫ్యామిలీలో ఉండే విలన్ గా కొత్తగా ఉన్నాడు. హీరోయిన్ ని పెళ్లి చేసుకుందామనుకు సాప్ట్ వేర్ ఇంజినీర్ వెన్నెల కిషోర్ బాగా పండింది. సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన ఉన్న సీన్స్ ఎంగేజ్ చేస్తూ వెళ్లాడు.   హీరో ప్రెండ్ గా చేసిన నటుడు రోషన్ ...స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.   కథపై ఆసక్తిని కలిగించే పాత్రే.    SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు వంటి  మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు
 


ప్లస్ లు 

హీరో క్యారక్టైరైజేషన్
వెన్నెల కిషోర్ కామెడీ
కెమెరా వర్క్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు

సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే సీన్స్
కాంప్లికేటెడ్ గా అనిపించే కథనం
మల్టిపుల్ లేయర్స్ ని సరిగ్గా డీల్ చేయలేదనిపించటం

ఫైనల్ థాట్

ఓ పూర్తి  లవ్ స్టోరీగా చూడాలనుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. క్యారక్టరైజేషన్ తో మమేకం అయితే బాగుందనిపిస్తుంది. ఓవరాల్ గా ఓ రొమాంటిక్ కామెడీ కు దగ్గరగా ఉందనిపిస్తుంది.

Rating: 2.75
---సూర్య ప్రకాష్ జోశ్యుల

 

బ్యానర్ : హన్విక క్రియేషన్స్, 
న‌టీన‌టులుః శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు
సంగీత దర్శకుడు: మణిశర్మ, 
సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్,
 సాహిత్యం: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కడలి, 
సహ నిర్మాత: రవికిరణ్ చావలి, 
కొరియోగ్రాఫర్: భూపతి రాజా,
పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్, 
కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి & రాజశ్రీ రామినేని
 ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్, 
అడిషనల్ డైలాగులు:హరికృష్ణ
నిర్మాత: బి.ఎన్.రావు,
రచన& దర్శకత్వం, ఎడిటింగ్ : శశిధర్ చావలి, 
 

click me!