మోడీ ప్రభ తగ్గుతున్న వేళ: టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రధాని ఫోటో

By Siva KodatiFirst Published May 10, 2019, 3:51 PM IST
Highlights

2014 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మోడీ ప్రాభవం తగ్గిందని, బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మ్యాగ‌జైన్ ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను కవర్ పేజీపై ప్రచురించింది

2014 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మోడీ ప్రాభవం తగ్గిందని, బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మ్యాగ‌జైన్ ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను కవర్ పేజీపై ప్రచురించింది.

మే 20, 2019న వెలువడే టైమ్ మ్యాగజైన్ యూరప్, మధ్య ప్రాశ్చ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోడీ కవర్‌స్టోరీ ప్రచురించింది. అయితే కవర్ పేజీపై మోడీ ఫోటో పక్కన ‘‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్ పెట్టి కథనాన్ని ప్రచురించింది.

దీనితో పాటు ‘‘మోడీ ది రిఫార్మర్’’ అనే మరో హెడ్‌లైన్ కూడా ఇచ్చింది. దీనిలో మొదటి కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ కుమారుడు ఆతిష్ తసీర్ రచించారు. మరో కథనాన్ని కన్సల్టింగ్ సంస్థ యురేసియా గ్రూప్ వ్యవస్ధాపకుడు ఇయాన్ బ్రెమర్ రాశారు.

మ్యాగజైన్ లోపల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్ల మోడీ ప్రభుత్వం వస్తుందా..? అనే పేరుతో తసీర్ కథనం రాశారు. ఇందులో ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, జీఎస్టీ, ఆధార్ వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు.

అలాగే బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోడీకి అదృష్టమంటూ రచయిత పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ గురించి కూడా రచయితలు ప్రస్తావించారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని దుయ్యబట్టారు.

రాహుల్‌కు తోడుగా సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందో ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కూడా అలాంటిదేనని రచయిత అభిప్రాయపడ్డారు. 

click me!