సర్వే ఫలితం: చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

By telugu teamFirst Published Mar 4, 2019, 5:36 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ 31 శాతం ఓట్లతో కేవలం 6 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. టీడీపి 2014 ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో 15 సీట్లను గెలుచుకుంది.అయితే, సీ ఓటర్ సర్వే ఫలితాల్లో వాస్తవం ఉందా అనేది చర్చనీయాంశమే.

అమరావతి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ లోకసభ స్థానాలను కైవసం చేసుకుంటుందని సీ ఓటర్ సర్వే గత నెలలో తేల్చింది. రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాల్లో వైసిపి 19 సీట్లు గెలుచుకుంటుందని, ఆ పార్టీకి 41 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది. 

తెలుగుదేశం పార్టీ 31 శాతం ఓట్లతో కేవలం 6 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. టీడీపి 2014 ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో 15 సీట్లను గెలుచుకుంది.అయితే, సీ ఓటర్ సర్వే ఫలితాల్లో వాస్తవం ఉందా అనేది చర్చనీయాంశమే. కానీ టీడీపిని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్ చేసే స్థితికి ఎదిగిందనేది మాత్రం వాస్తవం. 

పార్టీ స్థాపించిన కొద్ది కాలానికే జగన్ టీడీపికి గట్టి సవాల్ విసిరారు. 2011 మార్చిలో పార్టీ ఏర్పడింది. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుందనే అంచనా ఉంది. 

శాసనసభ ఎన్నికల్లో టీడీపికి 102 సీట్లు రాగా, వైసిపికి 67 సీట్లు వచ్చాయి. కాంగ్రెసు పార్టీ నామరూపాలు లేకుండా పోవడంతో వైసిపి టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. 

రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా మారారు. వారంతా వైసిపి వైపు మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటును వైసిపి సంపాదించుకుంది. అందువల్ల వైసిపి ఎపిలో బలమైన పార్టీగా ముందుకు వచ్చింది.

పార్టీ పెట్టిన ఏడాదికే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి తన సత్తా చాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 15 సీట్లలో వైసిపి విదయం సాధించింది. ఇందులో 13 సీట్లకు గతంలో కాంగ్రెసు ప్రాతినిధ్యం వహించింది. కాంగ్రెసు చేతిలో ఉన్న నెల్లూరు లోకసభ స్థానాన్ని కూడా ఉప ఎన్నికలో వైసిపి కైవసం చేసుకుంది. 

టీడీపి నేతల వలసల కారణంగా కూడా వైసిపి బలం పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఎంపీలు అవంతి శ్రీనివాస రావు, పి. రవీంద్ర బాబు, ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, అబ్దుల్ గనీ వైసిపిలో చేరారు. ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 

click me!