లెనిన్ శ్రీనివాస్ కవితా సంపుటి 'కలలు చెదిరిన కళ్ళు' పై ఖమ్మం నుండి యడవల్లి శైలజ ప్రేమ్ అందిస్తున్న సమీక్ష ఇక్కడ చదవండి
'కలలు చెదిరిన కళ్ళు' ఈ పుస్తకంలోని కవితలను గురించి ప్రస్తావించే ముందు ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో గమనిద్దాం. ఈ పుస్తకంలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.
- ముందు మాటలు లేకుండా ఈ పుస్తకం ప్రచురించడం
- ఇంకో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే చేతిరాతతో పుస్తకం ఆవిష్కరణ గావించడం.
చేతిరాత అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వెనుకటి రోజుల్లో చేతిరాతతో రాసిన ఉత్తరాలు. పోస్ట్ మాన్ మన ఇంటిముందు సైకిలు మీద నిలబడి ఉత్తరం ఇస్తుంటే ఎంత సంబరపడిపోతామో ! మనం ఆ ఉత్తరాన్ని చదువుతూ వాళ్ళు మన కళ్ళ ఎదుటేనిలిచినట్లే, ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లే అనుభూతి పొందుతూ ఉంటాం. తెల్లని కాగితం పైన నల్ల ఇంకుతో కానీ నీలం రంగు ఇంకుతో కానీ మనం రాసిన అక్షరాలను చాలాసార్లు తడిమి తడిమి చూసుకుంటాం. అంత మంచి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది చేతిరాత.
చేతిరాతపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు:
"Hand writing is more connected to the movement of the heart" - Natalice Gold berg
"Never lose an opportunity of seeing anything beautiful , for beauty is God's hand writing" - charies kingsley
మహాత్మాగాంధీ ఇంకా చాలా మంది చేతిరాతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కంప్యూటర్లు, టెక్నాలజీ, సెల్ ఫోన్లు పెరిగిపోయి కనుమరుగైపోతున్న ఈ చేతిరాతను తాను గుర్తు చేసుకోవడమే కాకుండా మనకు కూడా గుర్తుచేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న లెనిన్ శ్రీనివాస్ కు ముందుగా అభినందనలు.
పూర్వం ' మోబీడిక్' అనే ప్రఖ్యాత అమెరికన్ నవల, మార్క్స్ , శ్రీ శ్రీ రాసిన వ్యాసాలు చేతిరాతతోనే ప్రచురించబడ్డాయి.
ఇక ప్రస్తుత కవితా సంపుటిలోకి వస్తే ' జై జవాన్ - జై కిసాన్ ' ఒకరు దేశం కోసం సరిహద్దుల్లో మరొకరు దేశంలోని ప్రజల కడుపు నింపడం కోసం నిరంతరం కృషి చేస్తూనే వుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అని తరచుగా అందరూ అంటూ ఉంటారు. ఆ కూడు ఎలా వస్తుంది? ఎవరు పండిస్తున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పంట పండించే రైతు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ! తనఆవేదనంతా ' మట్టి కాళ్ళ మహాయాత్ర ' కవితలో వ్యక్తంచేశారు .
ఈ కవితలో రైతన్న తాను ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఎలా కష్టపడతాడో విశదీకరించారు. " మట్టి కాళ్ళు మురికి చేతులు / భూ పుత్రులు కర్షక జీవులు / స్వేదం చిందించే కర్మయోగులు" అంటూ . ఇదే కవితలో " కాళ్ళకు చెప్పులు లేవు ఒంటినిండా గుడ్డల్లేవు కడుపు నిండా తిండిలేని జీవచ్ఛవాలు " రైతు యొక్క దుర్ధశ , పండిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల వల్ల మోసపోతున్న రైతుల ఆవేదనను , రోడ్డుపైన కూర్చుని తమ హక్కులను సాధించుకోవడానికి పోట్లాడిన మట్టి పుత్రుల కష్టాలుకళ్ళ ముందు నిలిపారు. ఈ కవిత చదివిన తర్వాత కూడా రైతన్నను కాపాడుకోపోతే మనంత దురదృష్టవంతులు ఉండరేమో!
"కారు చీకటిని చీల్చే ఖడ్గం నీ ఓటు/ వెలుగులు పంచే ప్రమిధలో తైలం నీ ఓటు" - ఓటంటే సంత సరుకు కానేకాదు కవిత .
"అమ్మ భాష తెలుగు- అవని నిండ తెలుగు/ మాతృభాష తెలుగు- దారి దివిటీ వెలుగు" - అమ్మ భాషే లెస్స .
"తలకిందులైన నీతి నియమాలు/ మానవతా విలువలు మృగ్యం / మనిషిని మనిషి దోస్తూనే ఉన్నాడు" - మౌనాన్ని భరించలేక.
"గూడు చెదిరి గుండె పగిలి / రెక్కలు కత్తిరించిన పక్షులు వలస కూలీలు/ దారి పొడవునా రక్తపు అడుగుల ముద్రలు" - రక్తపు అడుగులు కవిత.
"రాజకీయ చదరంగంలో దుర్మార్గపు దుర్యోధనులెందరో/ శకుని పన్నాగాల శిష్యులెందరో - మస్తిష్కంతో చూడు"
శ్రీ శ్రీ లోని ఆవేశం కనిపిస్తుంది లెనిన్ శ్రీనివాస్ గారిలో అని అర్థమవుతుంది ఎవరికైనా ఈ కవిత చదివితే.
"తెగింపు లేని తెగువ ఎందుకు? పడగొట్టలేని పిడికిళ్ళెందుకు? ఎదిరించలేని గుండెందుకు? - ఉద్యమ బావుటా.
"అవనిలో సగం/ ఆకాశంలో సగం/ ఆమె లేనిదే శూన్యం అయినా చులకనెందుకో! " - అయినా చులకనెందుకో?
"అస్తవ్యస్త సమాజం గాడి తప్పిందో / తప్పించ బడిందో " - చైతన్యం కానంత కాలంఇలాంటి పచ్చి నిజాలను వినిపిస్తున్న కవితలు ఈ సంపుటి నిండా ఉన్నాయి.
(మనసును తడిపే జ్ఞాపకాలు / అవకాశవాదంతో మెలిగే మనుషులు/ ధైర్యంగా ఎదురు తిరగాలనే ఆశలు/ మద్యం మత్తులో మృత్యు ముఖం పట్టిన జీవితాలు / కష్టాల్లో కన్నీళ్లలో చేయి అందించే నేస్తాలు/ ఉడుకు రక్తం ఉరకలు వేసే చేగువేరా స్ఫూర్తి/అలసిపోయినప్పుడల్లా ఉత్తేజం నింపే జ్ఞాపకాలు / అమ్మలా అక్కున చేర్చుకున్న గుడిసె . ఇంకా ఎన్నో స్ఫూర్తిదాయకమైనకవితలు ఉన్నాయి. అందరూ చదవాల్సిన పుస్తకం.)
ప్రతి మనిషికి ఇంటితో ఉన్న సంబంధం మాటల్లో చెప్పలేనిది. తనకు ఇంటితో ఉన్న జ్ఞాపకాలు ఆ ఇంట్లో తన నాయనమ్మ, తాతయ్య, అమ్మా నాన్న కష్టపడిన తాలూకు గుర్తులు; సాహితీ ప్రపంచంలో తనకొచ్చిన జ్ఞాపికలు , బహుమతులు తనను తడిమి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని గుండె తడిచేసుకుంటూ రాసిన కవితల్లో మన అనుభవాలను కూడా చూసుకుంటాం.
చేతిరాతతో రాసిన ఈ పుస్తకం తప్పకుండా అందరికి చైతన్యాన్ని, ప్రేరణను అందిస్తుంది. ఈ పుస్తకాన్ని అందించిన లెనిన్ శ్రీనివాస్ అభినందనీయులు, ప్రశంసనీయులు .
ఈ కవి కళ్ళు ఎదురుచూసే సమాజం రావాలని కోరుకుందాం. నా కల నేరవేరుతుందా? అనే కవి ప్రశ్నకు సమాధానాన్ని వెతకాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. మనుషుల దృక్పథంలో మార్పు రావాలి. మనిషి సంఘజీవి అనే మాటలు నిజం చేయాలి. ఈ సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా , నైతికంగా, భౌగోళికంగా మార్పులు చేర్పులు తీసుకుని రావాలి.
ప్రతులకు:
లెనిన్ శ్రీనివాస్
సాహితీ కుటీరం, కాచిరాజుగూడెం, గాంధీ చౌక్
ఖమ్మం - 507003
చరవాణి: 9959852154 .