తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. ఆకాశపు వైశాల్యం శీర్షికతో విల్సన్ రావు కొమ్మవరపు రాసిన కవితను మీకు అందిస్తున్నాం. చదవండి.
ఆకాశపు వైశాల్యం ఎంత
అని అడిగాను
మా పూరి గుడిసె చూరులో
గూడు పెట్టుకున్న పిచ్చుకని
తుర్రున బయటకు
దూసుకుపోయింది
రాకెట్ వేగంతో
నా ప్రశ్న సరిగా వినిపించుకుందో లేదో!
వినిపించుకున్నా
సరిగా అర్థం చేసుకుందో లేదో!
మనసులో శoక మొదలైంది నాకు
టార్పెడో వేగంతో రెండో నిమిషంలోనే తిరిగొచ్చింది పిచ్చుక.
నా ముందుకొచ్చి
రెండు రెక్కలూ
టపటప కొట్టుకుంటూ
విశాలంగా చాపింది
సన్నని కంఠంతో
కొయిలలా కూసింది
ఒక కాలు పైకెత్తి
తన ముక్కు గోక్కుంది
చాలా సుతారంగా
తోకను నేలకానించి
తల పైకెత్తి ఆకాశం వైపు చూసింది
వాన రాకడ కోసం
నుదుటిపై చేయి పెట్టుకొని చూసిన రైతన్నలా
తుర్రున గూట్లోకెళ్ళి
పిల్లల్ని రెక్కల కింద దాచుకుంది
ఆకాశం ఉరిమినప్పుడు అమ్మ నన్ను
పొదివిలో దాచుకున్నట్టు