కె. శివారెడ్డి కవిత : దేనికైనా సిద్ధం

By Pratap Reddy Kasula  |  First Published Dec 13, 2021, 12:08 PM IST

తెలుగు మేటి కవి కె. శివారెడ్డి జగమెరిగినవారు. ఆయన కవిత్వం తెలుగు పాఠకులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. శివారెడ్డి రాసిన దేనికైనా సిద్ధం అనే కవితను ఇక్కడ చదవండి


వెళ్ళటానికి సిద్ధం
ఎదురు తిరగటానికి సిద్ధం 
ఎదుర్కొనటానికి సిద్ధం  -  విరిగిపోవడానికి 
తిరిగి నిర్మించుకుంటానికి సిద్ధం -
ఎల్లప్పుడూ సిద్ధమే - ఏ క్షణాన ఏమొచ్చినా 
ముఖాముఖి తలపడటానికి సిద్ధమే -
ఏదైనా రానీ, ఎటునుంచయినా రానీ
విచ్ఛిన్నకర దృశ్యమయునా సరే
వినూత్నంగా పగులుతున్న సందర్భమయినా సరే -
ఆహ్వానించి కౌగలించటానికి సిద్ధం -
ఎప్పుడూ సిద్ధంగా ఉండమని జీవితం చెప్పింది 
ప్రపంచం నేర్పింది -
ఏదీ స్థిరంగాదు,  అయినా సంక్షోభ భరితమైన క్షణాన్ని
ఉంగరాల్లా వేళ్లకు పెట్టుకుంటానికి సిద్ధం -
ఒక మెలకువ నన్నంటి పెట్టుకుని 
రాగల జీవితాన్ని అంతర్లీనం చేసుకుని 
ఆనందించటానికో దుఃఖించటానికో 
సదా సిద్ధంగా ఉండటం 
ఎవడన్నాడు యిది తేలికని,
సునాయసంగా దూక వచ్చని -
అవతలి ఒడ్డు పట్టుకు వేలాడవచ్చని -
సాలె పురుగు నోటి నుంచి వేలాడుతున్న దారంతో రేఖాచిత్రాలు గీయవచ్చు -
ఒక వెల్తురు కిరీటం నేయవచ్చు -
ఆకాశం నుంచి కిందకి జారుతున్న మెరుపు 
నీ చెంపల్ని తాకి అంతర్ధాన మౌతుంది 
అంతే అదంతే -  నిన్ను నీవు
సిద్ధం చేసుకోవటంలో వుంది
బల్బులోని రాగి తీగ ఈ వాక్యం 
వెలగవచ్చు -  రాలి పోవచ్చు
ఈ దశ రెండింటినీ 
సమానంగా చప్పరించటానికి సిద్ధం
సారె తిరుగుతుంది -
పాత్ర రూపొందుతుంది 
ప్రాణం పోసుకుని ప్రాణ జలాన్ని అందివ్వటానికి సిద్ధం -

click me!