శాంతి కవిత : విశ్వ నరులు

By Siva KodatiFirst Published Dec 31, 2022, 5:59 PM IST
Highlights

నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత ' విశ్వ నరులు ' ఇక్కడ చదవండి : 

నా నీలి కళ్ళ ఆకాశంలో
ఏ కళల లోపమూ లేని
పున్నమి జ్యోత్స్న పరిపూర్ణంగా
ముప్పూటలా ప్రతిఫలించే  ముచ్చట
ముందుగా చెబుతున్నాను!

నా దోసిట్లో దొర్లుతున్న దయపారావతంలో
తడిసి ముద్దై
కొత్తగా మొలకలేసి మొగ్గ తొడుగుతున్న
ఒక మనీషి మచ్చు తునక నెంచి
మున్ముందుగా పెడుతున్నాను!

లోలోన లోపాలతో దాక్కున్న
లొసుగుల తమస్సు తంటాలను
తాత్సర్యం మాని తుత్తునియలు చేసేసి
త్వర త్వరగా బైటకు తోసేసి
తోడి తెచ్చుకోనక్కర్లేని
ఆనంద జలధుల్ని తోడు తెచ్చి
అందరి ఆవేదనలు తీర్చేందుకు
అమాంతంగా అవ్యయంగా ఆప్యాయంగా 
అమృతం మందులా పడుతున్నాను!

దాపునే దొరికిన దాపరికం లేని
తృప్తిజల్లుల తొలకరిని తొందరించి
దారి పొడుగునా దారిద్ర్యం ధ్వంసం చేసి
దావానలాలు చల్లార్చిన
కస్తూరి దస్తూరి దాఖలాలు..
దామాషాలు దాచకుండా  లిఖిస్తున్నాను!

లౌల్యం లేకుండా లౌక్యంగా
లేచిగుళ్ళు చుంబించే లేత కిరణాలను..
చూపు చివుక్కు మనకుండా చూస్తూ..
ఆరాటం తీరేటట్టు ఆరగించమంటున్నాను!

భూగోళంపై గాలిగుప్పుమనే గుసగుసలను
గందరగోళం మరచి ఆర్భాటం లేకుండా
ఆహ్లాదంగా ఆస్వాదించమంటున్నాను!

వంకలు వంతులు లేని సంగతులతో వర్ధిల్లే
నూత్న సంతులన సంగీతాన్ని ఆహ్వానిస్తూ
డోలు దూరలేని సన్నాయి మ్రోగలేని
డోలాయమానమైన డొంకలలోనూ
ఓంకార నాదమై ఆవహిస్తున్నాను..
గుండె పెదాలతో గుబులు లేకుండా గుప్పిస్తున్నాను!

ఇదిగో క్రొత్త పొద్దని..
అందరినీ ఆప్యాయంగా కౌగిలించి
ఇంకా మొద్దు నిద్దురెందుకని
ఆత్మీయంగా హెచ్చరిస్తున్నాను!

ఓ నా మిత్రులారా...!
ఉత్సవపు ఉబలాటాలతో ఉవ్విళ్ళూరుతూ
అందరూ ఒక్కటై నాతో రండి!
ఉత్తేజంతో ఊర్థ్వానికెగిసి ఉప్పొంగండి..
మబ్బులపై ఊరేగండి..
మసకబారని మూర్తిమంతం పొందండి..
ధ్యానంతో దృఢపరిచి మిగుల పండిన మౌనాలను
మంగళధ్వానాలుగా మార్చి మ్రోగించండి!

దప్పికలు తీర్చుకుంటూ..
ఆక్రోశనలను ఆర్చుకుంటూ..
ఒక మహోదయంలో
పాశాలు పెకిలించి పారాడండి..
మోహాలు విదిలించి ముద్దాడండి!

విశ్వనరులై..
వినువీధి కెగసి నిల్చి విధాతలై..
పంకిలం పటాపంచలు చేసిన పద్మాకరులై..
వెలిబూది ధరించని హరులై...
వికసించండి.. వికసించండి.. వికసించండి!!!

click me!