సమాజంలో అణచివేతకు గురవుతున్న దళితులు ఉన్నత స్థాయికి చేర్చడానికి చదువు ఎలా దోహదపడుతుందో డా.పసునూరి రవీందర్ రాసిన కథ " తలదన్నినోడు " ఇక్కడ చదవండి :
సుభాష్ ఐపీఎస్. ఇంటి గోడకు గర్వంగా వేలాడుతున్నది నేమ్ ప్లేట్ బోర్డు. ఆ బోర్డు మీదికి ఆ అక్షరాలు రావడం వెనకాల చాలా పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. తన జాతిలో ఊడ్చే, తూడ్చే ఉద్యోగాలే కలగా మారిన కాలం. అలాంటి జాతి నుండి ఇటేడు తరాలు, అటేడు తరాలు ఎవ్వరూ అందుకోలేని, అందుకోనివ్వని మైలురాయి అది. ఆ నేమ్ ప్లేట్ ఉన్న బంగ్లాలోకి అడుగుపెడితే అదొక కడగొట్టు జాతి మనిషి ఇల్లు అని ఎవ్వరూ అనుకోలేరు. ఇంత పెద్ద పట్నంలో ఖరీదైన మనుషులుండే కాలనీలో ఇప్పుడు ఈ పేరు అట్లా ఒక పెద్ద బంగళా ముందు గర్వంగా తలెత్తుకొని ఉంది. రొమ్ము విరుచుకొని మరీ వేశాడుతున్నట్టు ఉన్నాయి. ఆ బోర్డు మీది అక్షరాలు.
ఆ అక్షరాలే అట్లా ఆత్మగౌరవంతో బోర్డు మీద ఉంటే ఇక సుభాష్ ఎట్లా ఉంటాడో చూడాలని ఎదురుచూస్తున్నారు ఆ యింటి ముందు కూర్చున్న కొందరు. పొద్దున్నే ఇంకా సూర్యుడు డ్యూటీ ఎక్కక ముందే వీళ్లు మాత్రం సదరు అధికారి ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. వారి ఎదురుచూపులకు వీడ్కోలు పలుకుతున్నట్టు అప్పుడే బయటికొచ్చాడు సుభాష్. అప్పటి దాకా తాను తన గదిలో ఉన్న జిమ్ యంత్రాల మీద రకరకాల వ్యాయమాలు చేసినట్టు చెమటలతో తడిసిన టీషర్ట్ సాక్ష్యం చెబుతున్నది. పెళ్లి కూడా కానీ ఈ యువ అధికారిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. వాళ్లను చూసి ‘‘కూర్చోండి... కూర్చోండి’’ అని వాళ్ల ముందున్న సోఫాలో అంతే గంభీరంగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు..
undefined
వచ్చినవాళ్లు తనకు తెలిసినవాళ్లే. తనకంటే వయసులో పెద్దవాళ్లే. వయసులోనే కాదు కులానికి పెద్దలే. ఎందుకంటే వాళ్లంతా తమ ఊరికి చెందిన వాళ్లే. చిన్నప్పటి నుండి తనను బాగా చూసినవాళ్లే. చూడడం కూడా మామూలుగా చూసినవాళ్లు కాదు, సుభాష్ ను చిన్నతనంలో సుబ్బిగా అని, అతని తండ్రి చంద్రయ్యను సెంద్రిగా అని మాత్రమే గౌరవించినవాళ్లు.
‘‘ఒరే చెప్పులుకుట్టే సెంద్రిగా ఏందిరా నీ కొడుకును ఏదో పెద్దసదువులు సదివిస్తనని నీల్గుతున్నావట. వాడు సదివి ఏమన్న కలెక్టరయ్యేది ఉన్నదార. మా దగ్గర జీతానికి పెట్టు. లేకుంటే ఈ ఊళ్లె నువ్ ఎట్లా ఉంటవో చూస్తం’’ అన్నడు నర్సిరెడ్డి పటేల్. ఊరి నాలుగు బాటల కాడ యాపచెట్టు కింద చెప్పులు కుడుతున్న చంద్రయ్యకు ఆ మాటలు చెమటలు పట్టించినయి. గుండె దడదడలాడుతుంటే నెత్తికున్న రుమాలు తీసి కళ్లు తుడుచుకున్నడు. నా కొడుకు ముచ్చట వీళ్లకెవలు చెప్పిన్రో అని ఆలోచించిండు. డప్పోని ఎంబడి కొమ్మోడు పడ్డట్టు వీళ్లు నా కొడుకు ఎంట పడ్డారేందనుకున్నడు. కానీ, సమాధానం చెప్పాలి కాబట్టి నెత్తికున్న రుమాలు తీసి చేతుల పట్టుకొని పటేలు ముందు తలవంచుకొని ‘‘మీరెట్ల చెప్తే అట్లనే పటేలా. కాకుంటే వాడిప్పుడు పదిట్ల ఉన్నడు. ఇదొక్క సదువు సదివినంక మీ దగ్గరనే జీతం పెడతా’’ అని బతిలాడిండు.
అట్లా కొడుకును ఊరు దాటించాడు చంద్రయ్య. మళ్లీ ఈ ఊరికి రాకు బిడ్డా, పట్నంలనే ఉండు. సదువుకో అని మాత్రం చెప్పగలిగిండు. వాళ్లు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పడుతా అని గట్టిగనే చెప్పిండు. తండ్రి మాటలో ఏదో లోతైన అర్థమున్నదనుకున్నడు. తండ్రి కల నిజం చేయాలనుకున్నడు. అట్లా ఊరిడిసిన సుభాషకు సదువులే లోకమైనయి. ఊరికి పోయినా యేరెండు మూడేండ్లకో ఏ పండుగకో పోయి వచ్చేటోడు. తప్ప, అక్కడ ఎక్కువ రోజులున్నది లేదు. అట్లా తన సదువు బందు పెట్టియ్యమన్న నర్సిరెడ్డి కొడుకే, ఇప్పుడు సుభాష్ ముందున్న కోటిరెడ్డి. కోటిరెడ్డితో పాటు మరో నలుగురైదుగురు ఊరి పెద్దమనుషులు కూడా వచ్చింరు. కోటిరెడ్డి నోరిప్పిండు.
‘‘బాగున్నరా సార్ మీ వల్ల మన ఊరుకే కాదు, జిల్లాకే పేరొచ్చింది.’’
ఆ మాటల్లో నర్సిరెడ్డికి ఉన్న గర్ర, పొగరు కోటిరెడ్డికి లేదని సుభాష్ కు అర్ధమైంది. తరం నుండి తరానికి మాట తీరు మారేటట్టు చేసింది కాలమే అనుకున్నాడు.
‘‘ఈ సారి బతుకమ్మ పండుగకు మనూళ్లె మీకు ఒక సన్మాన సభ పెడుతున్నం. మీరు తప్పకుండా రావాలె. అందుకోసం మీ పర్మిషన్ తీసుకుందామనే వచ్చినం." కోటిరెడ్డి వినయంగా అడిగిండు. బతుకమ్మ పండుగ పేరింటే సుభాషకు షాక్ కొట్టినట్టయితది. రక్తం సలసల మరిగిపోతది. గతం తన మనసు మీద చేసిన గాయాలు గుర్తుకొస్తయి. బతుకమ్మ పండుగంటే ఊరందరికీ వేడుకే. తన వాడకు మాత్రం ఆ పండుగ వెలుగు దరిచేరదు. అయినా ఒకసారి చేరినట్టే చేరి చెరిగిపోయింది.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సమయం. పట్నాలు సరే. పల్లెలు కూడా రగులుకున్నయి. నిత్యం ఏదో ఒక లొల్లి చేస్తనే ఉన్నరు జనం. మండల కేంద్రానికి చేరుకోవడం లేకుంటే ఊళ్లోనే సభో, దిష్టిబొమ్మల దహనమో, ధూంధాం మీటింగులో పెడుతున్న కాలమది. అట్లాంటి నిరసనల కాలంలో ఒకనాడు బతుకమ్మలు ఎత్తాలని జేఏసీ తీర్మానించింది. అందుకే అందరు బతుకమ్మలు పట్టుకొని రావాలని డప్పు సాటింపు వేయించాడు నర్సిరెడ్డి పటేల్. ఆ మాట విని వెలివాడ కూడా సంబురపడ్డది. ఈ రకంగానైనా మనం బతుకమ్మలు ఆడొచ్చనుకున్నది. సుభాష్ కు మాత్రం అసలు ఆ పండుగ తమకు ఎందుకు అంటరానిదయ్యిందని ఎంతకూ మనసున పట్టకపోయేది. అదే ముచ్చట అయ్యనడిగిండు.
‘‘అంతే బిడ్డ పెద్దకులపోళ్లు మనకు ఎట్ల చెప్తే మనం అట్లనే నడుసుకుంట వస్తున్నం. ఏమన్నంటే ఊరి కట్టుబాట్లు అంటారు. వాటిని మనం హద్దు మీరొద్దు కదా’’ అని నిట్టూర్చిండు.
సుభాష్ కు ఆ జవాబు రుచించలేదు. ఇంకా తెలుసుకోవాలనుకున్నడు. ‘‘మరి మనం ఎన్నడు బతుకమ్మ ఆడలేదా నాయినా? "
‘‘ఔను బిడ్డా, ఒకప్పుడు మన యిండ్లల్ల కూడా ఇతుకమ్మను చేసెటోళ్లట, కానీ, మనం పండుగలు చేసుకుంటే ఓర్వరు కదా బిడ్డా అట్లా ఏవేవో కట్టు కధలు కట్టి మనలను పండుగకు దూరం చేసిన్రు. తంగేడు, గునుగు పువ్వు తెంపుకొచ్చేది మనమే. వాటిని చెర్ల ఏసేందుకు డప్పుల సప్పుల్లు కొట్టేది మనమే. ఆఖరికి చెరువల దిగి సాగనంపేది మనమే. అయినా సరే మనల మాత్రం బతుకమ్మ ఆడొద్దంటరు ఈ దొరలు’’ అన్నదు చంద్రయ్య ఆవేదనతో.
‘‘మరి ఇయ్యాలె మనల కూడా బతుకమ్మను తీసుకొని రమ్మంటుండ్లు కదా నాయనా?’’
‘‘తెలంగాణ రావాలంటే అందరం ఒక్కటి కావాలె కదా, అందుకే సబ్బండ జనం వాళ్ల వాళ్ల బోనాలు, బతుకమ్మలు, డప్పులు, కత్తులు కటార్లు, తీరొక్క పనిముట్లు పట్టుకొని ప్రదర్శన చెయ్యాల్నట. అందుకే ఇక నర్సిరెడ్డి పటేలు కూడా మనసు మార్చుకున్నట్టు ఉన్నడు’’ అని చంద్రయ్య ఉన్న ముచ్చట కొడుక్కు చెప్పిండు.
ఊరి నాలుగు బాటల కాడ అందరు గుమి కూడిన్రు. బతుకమ్మలాడిన్రు. చిందోళ్లు, ఒగ్గోళ్లు ఆడిపాడింరు. బోనాల శిగం ఊగిన్రు. డప్పుల దరువుల మీద చిందులేసిన్రు. పాటలను హోరెత్తించిన్రు. జై తెలంగాణ అంటే... జై జై తెలంగాణ అన్నరు. జాతర సందడి సందడిగా సాగింది. అట్లా కొట్లాడంగ కొట్లాడంగా తెలంగాణ వచ్చింది. సుభాష్ కు మూతి మీద నూనూగు మీసంకట్టు వచ్చింది. నర్సిరెడ్డి అధికార పార్టీల జెడ్పీటీసీ అయ్యిండు. మరింత జోరు మీదున్నడు. ఊరి చుట్టు ఉన్న చెరువులు, వాగుల పూడికతీత పనులు కాంట్రాక్టు పట్టి కావాల్సినంత దండుకుంటున్నడు. తెలంగాణ పేరుతోటి ఆ ఊరిలో బాగుపడ్డది నర్సిరెడ్డి కుటుంబమే అనేది ఆ ఊరిలో పసిపోరడ్డిని అడిగినా చెప్తడు.
ఆ మరుసటి యేడు మళ్లీ బతుకమ్మ పండుగొచ్చింది. ఆ పండుగకు ఎప్పటిలాగే మాదిగవాడకట్టు మీద అమ్మలక్కలంతా తంగేడు, గోగు, గునుగు పూలతోటి బతుకమ్మలు పేర్చి ఆడడానికి సిద్ధమయ్యింర్రు. ఉన్న బట్టల్లొ జర మంచియి కట్టుకొని చెరువుకట్ట దారి పట్టింరు. మాదిగవాడ దాటిన్రో లేదో నలుగురు నర్సిరెడ్డి మనుషులొచ్చి అడ్డంగ నిలబడ్డారు. ఎక్కడికి బయల్దేరిన్రు అని అడిగిన్లు.
ఇంకెక్కడికి బతుకమ్ములు ఆడడానికి. ' బతుకమ్మలు... మీరా... మీకు బతుకమ్మ ఎక్కడిది? '
' అదేంది పోయిన యేడాది బతుకమ్మ ఆడడానికి అందర్ని రమ్మన్నరు కదా?! '
' అది అప్పటి ముచ్చట. '
' మరి ఇప్పుడు ఏమైంది ?? '
' తెలంగాణ పేరుతోటి ఊరి కట్టుబాట్లు మరిచిపోతరా? ' అన్నరు నర్సిరెడ్డి అనుచరులు. ఆ మాటలకు ఎస్సీ కాలనీ ఆడోళ్లందరికీ కోపమొచ్చింది. మీ యిష్టం వచ్చినప్పుడు ఆడుమంటే అడాలె. లేకుంటే బంద్ చెయ్యాల్నా అని కోపంతో సుగుణక్క లొల్లి పెట్టుకొని బతుకమ్మలను అక్కన్నే పడేసింది. ఆమె లెక్కన్నే మిగిలినోళ్లు కూడ తిట్లు శాపనార్ధాలతోటి అక్కడ్నే పడేసి ఏడుపు ముఖాలతో వెనుతిరిగిన్లు.
ఈ విషయం సుభాష్ కు తెలిసి చాలా విలవిలలాడిండు. ఎంతకాలం ఈ దౌర్జన్యం? ఉడుకు రక్తం పండ్లు పటపట కొరికింది. దీనికి ముగింపు ఎక్కడా అని ఆలోచించిండు. లోలోపలే రగిలిపోయిండు. ఆడోళ్లను వద్దంటే అన్నరు. మొగోళ్లను వద్దంటరా. పోయి చూస్తం. వాళ్ల మాట హద్దు మీరడానికైనా పోవాలని జిద్దుకు తనతోటి వాళ్లను మరో ఇద్దరిని తీసుకొని చెరువుకట్ట మీదికి పోయిండు.
గుంపులు గుంపులుగా ఊరి జనమంతా బతుకమ్మలు ఆడుతున్నరు. రంగురంగుల గుంపుల తీరు చెరువు గట్టు మెరిసిపోతున్నది. చీకటిపడే యాల్లయ్యేసరికి నర్సిరెడ్డి పెట్టించిన పెద్ద పెద్ద లైట్లు వెలుగుతున్నయి. మైకులు, సౌండు బాక్సుల్ల పాటలు మోగుతున్నయి. ఆ పండుగ వాతావరణంలో సుభాష్ కళ్లు నర్సిరెడ్డి కోసం వెతుకుతున్నయి. అతని స్నేహితులు మాత్రం ఒక మూలకు నిలబడి తమతో చదువుకున్న చిన్ననాటి క్లాస్మెట్లను చూస్తూ మైమరిచి నిలబడ్డారు. ఎక్కడి నుండి వచ్చిన్రో నర్సిరెడ్డి మనుషులు. ఒక్కసారిగా గొర్రెల మంద మీద పడ్డ తోడేళ్ల గుంపులాగా మీద పడి సుభాష్ ను అతని స్నేహితులను పట్టుకొని ‘‘ఏడికొచ్చిన్రురా మాదిగ కొడుకులారా... మీకు పండుగ కావాల్సి వచ్చిందారా’’ అనుకుంట కొడుతూనే ఉన్నారు.
‘‘కొట్టకుండ్రి వెళ్లిపోతం....’’ అని సుభాష్ మిత్రులు ఎంత బ్రతిమిలాడినా వినలేదు. అలా గొడవ వాతావరణం ఏర్పడ్డది. మైకుల్ల తప్ప బయట పాడే పాటలు ఆగిపోయినయి. ఎవరో వచ్చి, ' ఇక్కడి నుండి వెళ్లి పొండిరా. ఇక్కడికెందుకు వచ్చిన్రు ' అని నెట్టేసిన్రు. తనతో ఉన్న మిత్రుల కంటే సుభాష్ కు మనసంతా కలికలి అయిపోయింది. బతుకమ్మలు ఆడొద్దని అడ్డుకున్నరు. కనీసం చూడడానికి కూడా తమకు అర్హత లేదా? ఏందీ.. దారుణం అనుకున్నడు. అంతలోనే అక్కడికొచ్చిన నర్సిరెడ్డి ‘‘ఏమ్రా నువ్వు ఆ చెప్పులు కుట్టే చంద్రిగాని కొడుకువు కదా? జీతం రారా అంటే ఏందో పట్నం పోయి సదువుతున్నవట. తోడికలు తీస్త బిడ్డ. సదివి మా మీద తిరుగబడుదామని చూస్తున్నరు. మా కాళ్లక్రింద చెప్పుల్లెక్క పడి ఉండాలే అర్థమైందా?’’ అన్నడు.
‘‘సార్ వీలైతదా?!’’ అన్న కోటిరెడ్డి మాటతోటి గత చేదు జ్ఞాపకాల నుండి ఇప్పటి స్థితికి వచ్చాడు సుభాష్. అట్లా తనను అవమానించినోళ్లే మళ్లీ ఇవాళ తనను సన్మానిస్తమని రమ్మంటున్నరు. వెళ్లాలా వద్దా అని కొంతసేవు ఆలోచించిండు.
మీరొస్తే మన ఊరోళ్లు సంతోషపడుతరు సార్. జెర వీలు చేసుకొని రావాలె. మిమ్మల్ని తప్పని సరిగా ఆహ్వానించమని లోకల్ ఎమ్మెల్యే కూడా ఒక్కతీరుగా చెప్పిండి అన్నడు. ఇంతలోనే లోపలి నుండి పని మనిషి పచ్చిన వాళ్లందరికీ ఛాయ్ తెచ్చి ఇచ్చింది. ఊరికి పోక ఐదారేండ్లు అయ్యింది. తన తల్లి లచ్చవ్వ, తండ్రి చంద్రయ్య ప్రతీ యేడాదైనా దసర పండుగకు ‘‘రా బిడ్డా...’’ అని ఫోన్ల బతిలాడుతనే ఉన్నరు. కానీ సుభాష్ కు మాత్రం మనుసుల నర్సిరెడ్డి మాటలే యాదికొచ్చినయి. చెరువు గట్టు మీద తనను అవమానించిన గాయం ఇంకా సలుపుతూనే ఉంది.
‘‘చెప్పులు కుట్టుకొని బతికెటోళ్లు, మీకెందుకురా సదువులు, కొలువులు? మేం చెప్పినట్టు జీతం చేసుకుంటా, మేం పెట్టింది తిని మా కింద పడి ఉండాలె. మీ తాతతండ్రుల కాలం ఎట్లా గడిసిందో యాజ్జేసుకో. ఎప్పటికైనా... మీరు ఎక్కడికి పోయినా మా కాళ్లకిందికే రావాలే’’ అని నర్సిరెడ్డి చేసిన అవమానం సుభాష్ ఏనాడు మరిచిపోయింది లేదు.
నీడలా వెంటాడే గాయాలే మనుషులను రాటు దేలుస్తయన్నట్టు సుభాష్ నర్సిరెడ్డికి పొగరు అణిచే రోజుకోసం ఎదురుచూశాడు. అన్నీ పక్కన పెట్టి ఊరొదిలి సదువునే నమ్ముకున్నాడు. అనుకున్నట్టే సివిల్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు కొట్టి తన రాష్ట్రానికే ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్టయి వచ్చిండు. అందుకే ఇప్పుడు సన్మాన సభ.
ఇప్పుడు నర్సిరెడ్డికి లెక్క అప్పజెప్పాలి. తనను అవమానించిన నోటితోటే తమని చెప్పులు కుట్టే చేతులని తక్కువ చేసిన చోటే, ఆ చేతులు దేనినైనా సాధిస్తాయని నిరూపించాలి. సమయం వచ్చింది. కానీ ఎక్కడో తనకు మనసు ఒప్పడం లేదు. ఇంతకాలం తమ జాతిని అవమానించినోడికి సన్మానించాలనే పెద్దమనసు ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనకాల కారణం ఏమై ఉంటదని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు సుభాష్.
"ఏమంటారు సార్? " వీలు చేసుకొని రావాలంటున్నాడు కోటిరెడ్డి. అంతేకాదు ఊరికి ఇరవై యేండ్లు సర్పంచ్ గా పని చేసిన మా నాయిన కూడా మీ విజయానికి చాలా సంతోషపడుతున్నాడు అన్నాడు కోటిరెడ్డి.
కనీసం మంచి బట్టకడితే ఓర్వలేనోని నర్సిరెడ్డి ఇవాళ నా సక్సెస్కు ఇంతగా ఎట్లా మురిసిపోతడు? లోలోపల రగిలిపోతూ బయటికి మాత్రం నటిస్తున్నాడా? దీని వెనకాల కధ యేంటో తెలుసుకోవాలనుకున్నాడు. సుభాష్. సరే ఆ ముచ్చట తర్వాత తెలుసుకోవచ్చు. ముందు వీళ్లను పంపిద్దామని ‘సరే నేను వస్తా’ అని తన అంగీకారాన్ని మాత్రం తెలియజేసిండు. పిట్ట వలలో పడ్డది అన్నట్టు సంబురపడ్డడు కోటిరెడ్డి, ఆయనతో వచ్చిన ఊరి పెద్ద మనుషుల బృందం. బయటికి మాత్రం అంతే చాలు సార్. మీరు ఒప్పుకున్నరు. మాకు సంతోషం. మేము ఇక ఏర్పాట్లల్లో ఉంటామని చెప్పి సెలవు తీసుకొని వెళ్లిపోయారు.
ఊరి నాలుగు బాటల కాడ పెద్ద స్టేజీ ఏర్పాటు చేసిన్రు. ఐదారు వందల కుర్చీలేసిన్రు. ఆ ఊరు పుట్టినప్పటి నుండి ఇదే పెద్ద సభ అన్నట్టు ఉంది. దారి పొడవున రంగురంగుల ఫ్లెక్సీలు సుభాష్ ఫోటోలతో మెరిసిపోతున్నయి. ఊరి యిండ్లు మొదలయ్యేకాడ మరింత పెద్ద ప్లెక్సీ కట్టింన్రు. సుభాష్ రాక కోసం తన జాతి జనం డప్పుల చప్పుల్లతో అదిరిపోయే స్వాగతం పలికిన్రు. వాళ్లల్లో కూడా తనకు తెలిసిన వాళ్లే ఉన్నరు. తనను చిన్ననాడు ఎత్తుకొని ఆడించినోళ్లు. ఆ సమయాన వాళ్లను అట్లా చూస్తే కళ్లల్లో ఆనందబాష్పాలు వచ్చాయి. మరోవైపు తనకే కాదు మరెవ్వరు వచ్చిన తన జాతి వాళ్లు ఇట్లాగే ఒక్కరోజు కూలీకి దప్పులు కొట్టాల్సిందేనా అని ఒకింత బాధ కూడా పడ్డాడు. డప్పులు, బ్యాండు దరువులు హోరెత్తాయి. అన్ని కులాలోల్లు ఇవాళ ఏ పని పెట్టుకోవద్దనె నర్సిరెడ్డి హుకుంకు తలవంచినట్టు ఉన్నారు.
ఊరి వీధుల గుండా టాప్ లేని జీపులో సుభాష్ ను ఊరేగిస్తున్నారు. పూలు చల్లుతున్నారు. జనం వెంట నడుస్తున్నారు. హోరెత్తే దరువులకు యువకులు డ్యాన్సులు వేస్తున్నరు. ఊరి జనమంతా సుభాష్ కు రెండు చేతులతో దండాలు పెడుతున్నారు. సుభాష్ కూడా వారికి అంతే గౌరవంగా ప్రతి నమస్కారం చేస్తున్నాడు. అట్లా ఒక అరగంటకు పైగా ర్యాలీ నడిచి వేదిక వద్దకు చేరింది.
అప్పటికే అక్కడికి అన్ని కులాల జనం వచ్చారు. సుభాష్ కళ్లు మాత్రం తన జనం కోసం వెతుకుతున్నాయి. ఓ మూలన నిలుచున్న వాళ్ల దగ్గరికి వెళ్లి అందరికీ దండం పెట్టి, షేక్ హ్యాండులిచ్చి చుట్టాలందరినీ కౌగిలించుకున్నాడు. ముఖ్యంగా తల్లిదండ్రుల కాళ్ల మీద పడి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. ఇక వేదిక వైపు తిరిగాడో లేదో.. మీద పడుతున్న ఛాయలతో నర్సిరెడ్డి హడావుడిగా దండం పెట్టుకుంటూ తన అనుచరులతో ఎదురొచ్చాడు. సుభాష్ మాత్రం నిండుకుండలా ఉన్నాడు. దగ్గరికొచ్చి సుభాష్ తో చేతులు కలిపాడు నర్సిరెడ్డి. చేతులిచ్చిన సుభాష్ ‘‘బాగున్నారా?’’ అని చిరునవ్వుతోనే కుశలక్షేమాలు అడిగిండు.
నర్సిరెడ్డి జీవితంలో ఎన్నడూ చూడని, చూడలేని వినయంతో ‘‘బాగున్నం సార్’’ అని సుభాష్ ను మంది మార్భలంతో వేదిక వద్దకు తీసుకెళ్లాడు. సుభాషను వేదిక మీదికి పిలిచే ముందు ఊరు ముద్దుబిడ్డా అని, ఈ ఊరి పేరును దశదిశలకు చాటిన ఘనుడు అని రకరకాల విశేషణాలతో పిలిచారు. నిలువెత్తు గజమాలలు తెచ్చి తన మెడలో స్వయంగా నర్సిరెడ్డే వేశాడు. ఊరంత ముక్కున వేలేసుకున్నది. ఏనాడు కింది కులాన్ని ఓర్వని నర్సిరెడ్డి పటేల్లో వచ్చిన మార్పును నమ్మలేకపోతున్నారు. సుభాష్ తల్లిదండ్రులను కూడా వేదిక మీదికి పిలిచి ఘనంగా సన్మానించారు. కొత్తబట్టలు పెట్టి గౌరవించారు. సుభాష్ చేతుల మీదుగానే ఆ తంతునంతా జరిపించారు. ఇంతకాలం చంద్రిగా అని పిలిచిన నోటితోటే ‘చంద్రయ్యగారు రండి’’ అన్నారు. ఒసేయ్ లచ్చి, అసేయ్ లచ్చి అని ఇంతకాలం పిలిచిన లచ్చమ్మను ‘‘లక్ష్మమ్మ గారు’’ అని పిలిచాడు నర్సిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి. ఊరందరికీ ఇది కలా నిజమా అనిపిస్తున్నది.
ఎన్నో దుర్మార్గాలు చేసి, ఊరిని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఎంతకైనా వెనుకాడని దొర ఇట్లా సాధుజీవిలా ఎట్లా మారిండో జనానికి సైతం అంతుపట్టలేదు. ఈ మార్పుకు కారణం ఏందో ఎవ్వరన్నా చెప్తే బాగుండని ఎదురు చూశారు. సుభాష్ గురించి లోకల్ ఎమ్మేల్యే, తదితర ప్రజాప్రతినిధులు అంతా పొగడ్తలతో ముంచెత్తారు. పనిలో పనిగా సుభాష్ చదువుకోవడం వెనకాల ఎంతో కొంత నర్సిరెడ్డి ప్రోత్సాహం కూడా ఉందన్నారు. ఆ ప్రోత్సాహం ఏందో సుభాష్ కు మాత్రం అర్థంకాలేదు. ఒక చిరునవ్వు మాత్రం నవ్వుకున్నాడు. అందరి ఉపన్యాసాలు అయ్యాక సుభాష్ ను మాట్లాడమన్నారు. ఇవాల్టి మన ముఖ్య అతిథి మన ఊరి ముద్దుబిడ్డ, లక్షలాదిమందికి స్ఫూర్తిదాత, ఐపీఎస్ అధికారి శ్రీ సుభాష్ సార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఊరి ప్రజలందరి తరపున కోరుతున్నాను.
సుభాష్ మైకు ముందుకు వచ్చే సమయంలో నర్సిరెడ్డి సుభాష్ చెవిలో ఏదో చెప్పాడు. సుభాష్ ఆ మాటకు చిన్న చిరునవ్వు నవ్వాడు. మైకు ముందుకు వచ్చిన సుభాష్ ‘‘అందరికీ ధన్యవాదాలు. నా పట్ల ఇంత ప్రేమను, అభిమానాన్ని చాటినందుకు ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నేను ఈ ఊరి బిడ్డగా ఎల్లప్పుడూ ఈ ఊరి మేలునే కోరుకుంటాను. ఈ ఊరు బాగుపడాలంటే మంచి మార్గంలో పయనించాలి. ప్రతీ తల్లిదండ్రీ తమ పిల్లలను గొప్పగా చదివించండి. అస్తిపాస్తులు లేని కుటుంబంలో పుట్టిన నన్ను ఇవాళ మీ అందరి ముందు నిలబెట్టింది చదువే’’ అని వచ్చి రెడ్డి దిక్కు చూశాడు. నర్సిరెడ్డి బిక్కు బిక్కుమని నీళ్లు నములుతున్నాడు. జనం ఈలలు గోలలతో చప్పట్లు కొట్టారు. ‘‘ఒకనాడు ఇదే ఊర్లో మేము తలెత్తుకొని బతకాలనుకున్నం. ఆనాడు మమ్మల్ని కొందరు అర్థం చేసుకోలేదు’’అని సుభాష్ నోట్లో నుండి ఆ మాట రాంగనే నర్సిరెడ్డి ముఖంలో నెత్తురు చుక్కలేదు. తననే అంటున్నాడని కంగారుపడ్డాడు. తలదించుకొని కండువతో మొఖం తుడుచుకున్నడు.
‘‘ఇవాళ ఊరే కాదు. ప్రపంచమే మారుతున్నది. మనం కూడా మారాలి. మన నర్సిరెడ్డి గారు కూడా ఇట్లా నా మీద ఇంత అభిమానాన్ని చూపించినందుకు చాలా సంతోషం. వారికి నా ధన్యవాదాలు’’. ఈ మాటకు జనం చప్పట్లు కొట్టగానే నర్సిరెడ్డి దించిన తల ఎత్తి చూసిండు. కరెంటు పోయి వచ్చినట్టు నర్సిరెడ్డి మొఖంలో ఒక వెలుగు వచ్చి చేరింది. మందిలో ఎక్కడ తన ఇజ్జత్ తీస్తడోనని గాబర పడ్డాడు. కానీ, సుభాష్ సంస్కారానికి లేచి నిలబడి చేతులెత్తి మొక్కిండు.
‘‘మనం మనుషులం. మారాలి. మంచి మార్గంలో నడవాలి. మనం పోయిన తరువాత మన గురించి ఈ లోకం ఏమనుకుంటుందో కూడా ఆలోచించుకోవాలి. అట్లా నర్సిరెడ్డిగారు ఆలోచించినట్టు నాకు అనిపిస్తున్నది’’ అని మరో ప్రశంస విసిరాడు సుభాష్. జనం ఈలలు వేసి, సప్పట్లు కొట్టారు. ఆ దెబ్బకు నర్సిరెడ్డికి ఇక చెప్పలేనంత ఆనందం వేసింది. ఇక కూర్చోలేకపోయాడు. లేచి ఒక ఉదాట్న సుభాష్ ముందున్న మైక్ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్త సార్, మీరు అనుమతిస్తే అని చేతులు జోడించిండు.
‘‘సుభాష్ సార్ నన్ను క్షమించాలి. నేను ఆయనను చిన్నతనంలో ఎంతో బాధపెట్టి అవమానించినోణ్ణి నేను. ఆయననే కాదు, వారి తండ్రి చంద్రయ్యగారిని కూడా అనరాని మాటలన్నోణ్ణి. అందుకే కనీసం ఈ సభకు పిలవడానికి కూడా, నాకు మొఖం లేక సార్ను ఆహ్వానించడానికి నా కొడుకునే పంపినా. ఈ సభలో నన్ను ఏడ తిట్టి తన ప్రతీకారం తీర్చుకుంటడో అనుకొని భయపడతనే ఉన్నా. అయినా సరే ఇంత పెద్దమనసుతో నన్ను సార్ క్షమించినందుకు నాకు ఇయ్యల చెప్పలేనంత సంబురంగా ఉన్నది. మరోసారి సార్కు, సార్ కుటుంబానికి నా చేతులెత్తి క్షమాపణ వేడుకుంటున్నా’’ అని మైకు సుభాష్ చేతికిచ్చాడు..
జనం మరోసారి ఈలలు వేసి, చప్పట్లు కొట్టిన్రు. మాదిగవాడ జనం మాత్రం నర్సిరెడ్డి పొగరు అణచడం సుభాష్ వల్లే అయ్యిందనుకున్నారు. అట్లా నర్సిరెడ్డి చేతులెత్తి క్షమాపణలు చెబుతుంటే తమ జన్మధన్యమైనట్టు సుభాష్ తల్లిదండ్రులు ఆనందబాష్పాల్లో మునిగారు..
నర్సిరెడ్డి కూడా ఇక గుండె బరువు దిగినట్టు పోయి తన కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు సుభాష్ మళ్లీ ఉపన్యాసం కొనసాగిస్తూ...’’ అయితే... ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది. దానిని చెరిపేందుకు అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న వాళ్లను మాత్రం నేను వదిలిపెట్టను. చట్టం ముందు ఎవ్వరికైనా శిక్ష పడాల్సిందే. ఇప్పటికైనా ! తవ్వకాలు ఆపితే వాళ్లకే మంచిది’’ అని ముగించాడు. నర్సిరెడ్డికి సుభాష్ ప్రకటనతో కళ్లు బైర్లు కమ్ముకున్నాయి. సన్మానం పేరుతో పోలీసు అధికారిని బుట్టలో వేసుకోవాలనుకున్న నాటకం బట్టబయలైంది. తాడి తన్నెటోని తలను తన్నెటోడు ఒకడుంటాడని ఊరి జనానికి అసలు కథ ఇప్పుడు అర్ధమైంది. ఆ ఊరిలో కొత్త చరిత్ర మొదలైంది.