తెలంగాణ తేజోమూర్తి ఆచార్య మడుపు కులశేఖర రావు

By telugu team  |  First Published Jul 12, 2021, 3:06 PM IST

తెలంగాణ తొలి తరం సాహితీ విమర్శకులు ఆచార్య మడుపు కులశేఖర రావు  సాహిత్య కృషిపై వేదార్థం మధుసూదన శర్మ వ్యాసం


తెలంగాణ రాష్ట్రంలో కవులు, పండితులు, కళాకారులకు కొదవలేదు.  ఎందరో కవులు తమ ప్రతిభా వ్యుత్పత్తులతో గొప్ప గొప్ప కావ్యాలు వెలువరించారు.  తొలి తెలుగు రామాయణం, తొలి తెలుగు నవల మొదలైనవి తెలంగాణ రాష్ట్రం నుండే వెలువడ్డాయి.  ఈ పరంపరలో కృష్ణమాచార్యులు రచించిన 'సింహగిరి వచనాలు' తెలుగులో తొలి గద్య రచన.  14 వ శతాబ్దిలో రచింపబడిన ఈ వచనాలను తన పి హెచ్ .డి పరిశోధనలో భాగంగా వెలుగులోకి తెచ్చి, తెలుగు సాహిత్య లోకానికి అందించిన మహానుభావుడు ఆచార్య మడుపు కులశేఖర రావు.

తంజావూరు గ్రంథాలయంలో భద్రపరిచిన ఈ ప్రతిలో  ఉన్న 60 సంకీర్తనా వచనాలను 1968లో వారి పీఠికతో ఆంధ్ర రచయితల సంఘం వారు, 1980లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు, 2018లో తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ముద్రించారంటే ఆ గ్రంథం యొక్క ప్రశస్తి, ఆచార్య కులశేఖర రావు  ప్రతిభా పాండిత్యాలు మనకు ఆశ్చర్యం కలిగించక మానవు.

Latest Videos

undefined

ఆచార్య మడుపు కులశేఖర రావు   రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కేర్త మేడిపల్లి గ్రామంలో శ్రీమతి మడుపు జానకమ్మ, పరాంకుశ రావు గారలకు 1932 నవంబర్ 1 వ తేదీన జన్మించారు.  స్వగ్రామంలో  ప్రారంభమైన వారి విద్యా వ్యాసంగం ఇంతింతై వటుడింతై అన్న చందాన సాగింది.  డిగ్రీ, పీజీ, పీహెచ్డీలను తన ప్రతిభా పాటవాలతో పూర్తి చేసేలా చేసింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో ప్రముఖ రచయిత్రి డాక్టర్ పాకాల యశోదా రెడ్డి,  కథకులు డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి మొదలైనవారు  వారి సహాధ్యాయులు.  'ఆంధ్ర వచన వాఙ్మయం - ఉత్పత్తి వికాసములు' అనే అంశంపై డాక్టర్ దివాకర్ల వెంకటావధాని  పర్యవేక్షణలో చేసిన పరిశోధన నవతరం పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచింది.

తెలుగు సాహిత్యంలో వచన ప్రక్రియ ప్రధానంగా మూడు శాఖల్లో వికాసాన్ని పొందింది.  మొదటిది ప్రాఙ్నన్నయ యుగం నుండి  నాయక రాజుల వరకు. ఆయా వంశాల రాజులు ప్రకటించిన శిలా శాసనాలు. రెండవది చంపూ కావ్యాలు.  మూడవది వచన రచనలు.  ఈ విధంగా ఆయా అంశాలకు సంబంధించి తంజావూరు, మద్రాసు వంటి ప్రదేశాలలోని అనేక తాళపత్ర గ్రంథాలను పరిశీలించి, పరిశోధించి ఎన్నో నూతన విషయాలను వెలుగులోకి తెచ్చారు.  తెలుగు టైపింగ్ లేని ఆ కాలంలో చేతిరాతతో మూడు ప్రతులు రాసి, విశ్వవిద్యాలయ ఆచార్యులకు వారు సమర్పించినారంటే, వారి ప్రతిభా, కృషి అనన్య సామాన్యం అని చెప్పక తప్పదు.  1964లో, 1971లో రెండు పర్యాయములు ముద్రణ పొందింది వారి పరిశోధన గ్రంథం.

వారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ సేవలను ప్రారంభించి, ఉపన్యాసకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  ప్రవేశించారు.  తెలుగు శాఖలో ఆచార్యునిగా,  శాఖాధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా వివిధ హోదాలలో సేవలు అందించి, 1992లో పదవీ విరమణ పొందారు.  తెలంగాణ సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యుడిగా సంస్థ అభివృద్ధికి చేయూతను అందిస్తూ, తెలుగు భాషా సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేశారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసి, తెలంగాణలో తొలితరం సాహితీవేత్తగా, అగ్రశ్రేణి విమర్శకుడిగా గుర్తింపు పొందారు.

తెలుగు సాహిత్య చరిత్రను  'ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్'  పేరిట ఆంగ్లంలో ఒక విమర్శనా గ్రంథాన్ని రాశారు.  ప్రముఖ రచయిత్రి డాక్టర్ పాకాల యశోదా రెడ్డితో కలిసి  'కావ్యానుశీలం'  అనే గ్రంథాన్ని రచించారు.  యువ పరిశోధకులకు ఉపయుక్తమయ్యే విధంగా 'తెలుగు సాహిత్యం పరిశోధన'  అనే గ్రంథాన్ని, 'సాహిత్య పరిశోధనా పద్ధతులు' అనే మరొక గ్రంథాన్ని వెలువరించారు.  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డిపై ఉండే అభిమానంతో, వారి బహుముఖ పాండిత్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఆంగ్లంలో  'Dr.C.Narayana Reddy a literary profile'  అనే గ్రంథాన్ని  'Towards multitude' (selected poems of Dr C Narayana Reddy) అనే మరో గ్రంథముతోపాటు, విదేశాలలోని వారికి మన పురాణాలలోని విశిష్టతను తెలియజేసే విధంగా మహాభారతంలోని 18 పర్వాలను ఆంగ్లంలోకి అనువాదం చేసిన గొప్ప పండితుడు డాక్టర్ కులశేఖర రావు గారు.  ఇవే కాకుండా చేమకూర వెంకటకవి కవితా వైభవం, తెలుగు వచన వికాసం, రుచిరాలోకం వంటి విమర్శనా గ్రంథాలను, సీతాసతి, శ్రీనివాస శతి, శ్రీ కృష్ణ చరిత్ర, యశోధర చరిత్ర, శ్రీకృష్ణ విలాసం మొదలైన  పద్య కావ్యాలను రచించారు.

కవి కేవలం ఊహాలోకంలో సంచరించి, ఆయా దృశ్యాలను సృష్టించి, పాఠకులకు రసోల్లాసం కలిగించడమే కాదు.  తన ఎదుట ఉండే లోకాన్ని దర్శించి, సామాజికంగా దానిలో లీనమై, మంచి చెడులకు స్పందించడమే సామాజిక స్పృహ.  ఆ భావనతోనే వారు భాగ్యనగరం, వందేమాతరం,  ఆలోకనం, దర్శనం, లోక గీత, కలియుగం మొదలైన పద్య సంపుటులను వెలువరించారు.

తెలుగు సాహిత్యంలో యాత్రా చరిత్రలు వచన రూపములోనే వచ్చాయి. పూర్వం ఆధిబట్ల నారాయణదాసు, జాషువా, తిరుపతి వేంకట కవులు మాత్రమే తమ స్వీయ చరిత్రలను పద్యాలలో రాసుకున్నారు. కానీ ఆచార్య మడుపు కులశేఖర రావు గారు ఉద్యోగ రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణముగా అమెరికా, కెనడా వంటి దేశాలలో పర్యటించినపుడు, వారు దర్శించిన చారిత్రక విశేషాలను, అద్భుత దృశ్యాలను, అపురూప కట్టడాలను పద్య రూపములో కన్నులకు కట్టినట్లుగా పశ్చిమం, వైదేశికం వంటి గ్రంథాలలో వర్ణించారు.  వీటిని చూసిన తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డా.పేర్వారం జగన్నాథం  పద్య రూపములో వచ్చిన మొట్టమొదటి యాత్రా చరిత్రలుగా పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఉన్నప్పుడు వారు సంప్రదాయ సాహిత్య అంశాలను పరిశోధక వస్తువులుగా ఇచ్చి ఎందరో ఎంఫిల్, పీ.హెచ్ డి. పరిశోధక విద్యార్థులకు మార్గ దర్శకత్వం వహించారు. గాంధేయవాదిగా,  కీర్తి కాంక్షలేని నిరాడంబర వ్యక్తిగా, ఎలాంటి అవార్డులు, రివార్డులు, పదవులు ఆశించకుండా, తెలుగు భాషా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహా మనీషి మే 25, 2019 న ఈ లోకాన్ని వదిలి పెట్టి వెళ్లారు.  పండితా గ్రేసరునిగా, కవిగా, రచయితగా, పరిశోధకునిగా, ఆచార్యునిగా, విమర్శకునిగా తెలుగు సాహిత్యానికి అవిశ్రాంత, అవిరళ కృషి చేసిన తెలంగాణ తేజోమూర్తి ఆచార్య మడుపు కులశేఖర రావు.  వారి జీవితం, సాహిత్య కృషి నేటి తరం కవులకు, రచయితలకు, పరిశోధకులకు మార్గదర్శకం. 

click me!