కొండపల్లి నిహారిణి కవిత: ముద్దాయి

By telugu teamFirst Published Jun 25, 2021, 5:32 PM IST
Highlights

బరువుబాధ్యతలను మరిచి హృదయ న్యాయస్థానంలో  "ముద్దాయి" లుగా నిలిచిపోయిన వారిని డా. కొండపల్లి నీహారిణి తమ కవితలో నిలదీస్తున్నారు.

కాలానికి ఆవల గడియారం ముల్లు
ఒక పరిమిత పదనిర్దేశం చేస్తుంటే,
నీలోని ఉద్విగ్నత అంతా 
నాడీమండలం దాటి,
ప్రకృతి శక్తులు దాటి,
నాదైన ప్రకృతికి వైరుద్ధ్య ప్రకంపనలిస్తున్నది
ఓ పన్నెండు సిద్ధాంతాలను భుజానవేసుకున్న
సంఘజీవి బ్రతుకుపోరునుండి ,
జగత్తంతా మిధ్య అనలేని పామరజీవి వరకు,
పారమ్యత కోరుకునే పండితుని వరకు,
పాలుగారే పసిడికాంతుల ధగధగల వరకు,
నువు సృష్టస్తున్న అలజడులను గమనిస్తూ,
 అంచున ఉన్నది అగాధమని తెలిసీ 
వెనుదిరుగని తత్వమొకటి సౌహార్ద కేతనమెగురవేస్తున్నది.
ఎప్పటివో అంతరాలనెత్తి , ఇప్పటివిగా కుప్పబోస్తున్న పోకడలముందు
తలొంచి,తలపంకించి, తలావొకతీరున దాటిస్తున్నదంతా 
భూమాత చూస్తూనే ఉన్నది!
ఈ బ్రతుకు సత్యం ఒక చరమ సత్యం .
కలిసిమెలసిసాగే క్రాంతి ప్రయాణంలో కలతల చిచ్చుపెట్టొద్దని 
మూసిపెట్టిన గుండెకోట, గండికోట రహస్యాన్నేదో చెప్తున్నది!
నువు మోసే పరువు బాధ్యతలకన్నా ,
నువు మోయాల్సిన బరువుబాధ్యతలేవో
నీ హృదయ న్యాయస్థానంలో ఇక తేల్చుకో!

click me!