ఆకాశంనుంచి రాలిన చినుకులు నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' యుగళగీతం ' ఇక్కడ చదవండి :
వర్షంలో ఓ చెట్టు
తడిసి ముద్దవుతుంది
దేహమంతా పరవశించి పోతుంది
ఆకాశంనుంచి రాలిన చినుకులు
ఆకుల మీంచి ముత్యాల్లా జారి
నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి
undefined
అప్పటికే తడిసి పులకరించిన నేల
చెట్టువైపు మట్టి పెదాలతో
చిరునవ్వు విసుర్తుంది
కొంచెంసేపటికి వర్షం నిలిచిపోతుంది
విసురుగా వీస్తున్న చల్లగాలికి
వణుకుపుట్టిన చెట్టు ఒళ్ళు విరుచుకుని
కొమ్మలన్నింటినీ పైకెత్తి
ఆకులన్నింటినీ అందంగా చాపి
ఆకాశానికి కృతజ్ఞతలు చెబుతుంది
నేల తన గొంతుకలిపి
'యుగళ గీతం' పాడుతుంది